హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి సభ్యుడు మీర్జా రహ్మత్ బేగ్‌ను మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అభ్యంతరకరమైన నకిలీ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ నిందితులు ఈ దందాకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తొలుత ఎమ్మెల్సీని రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన నిందితులు, అనంతరం రూ.5 లక్షలు వసూలు చేశారు. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో నవంబర్ 5న ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్లిన నిందితులు రూ.4 లక్షలు తీసుకుని వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నవంబర్ 6న చేపట్టిన ఆపరేషన్‌లో నార్సింగి పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.70 లక్షల నగదు, రెండు ఆటోలు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులతో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రధాన నిందితుడితో పాటు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడి డబ్బులు చెల్లించవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
