మంచిర్యాల: జిల్లాలోని మందమర్రి కాంగ్రెస్ పార్టీ బి-1 కార్యాలయంలో 68 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం జరగకుండా చూడాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆరు నెలల్లో మున్సిపాలిటీల అభివృద్ధి
మందమర్రి, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల రూపురేఖలను రానున్న ఆరు నెలల్లో మార్చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో సింగరేణికి చెందిన ఏడు ఎకరాల స్థలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే తెలంగాణ రైతాంగం సాగునీటి సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రి విమర్శించారు. రానున్న పంట సీజన్లో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే ప్రస్తుతం ఎదురవుతున్న సాగునీటి సమస్యలు ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిలిపివేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఉంటే, కేసీఆర్ హయాంలో నిర్మించిన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు ఎందుకు కుంగిపోయాయని ప్రశ్నించారు.
భారత్ సమ్మిట్లో 320 మంది అంతర్జాతీయ ప్రతినిధులు
రాహుల్ గాంధీ నేతృత్వంలో నవంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న భారత్ సమ్మిట్లో 320 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.
ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
