నవంబర్ 14న హైదరాబాద్‎కు రాహుల్..ఖర్గేతో కలిసి భారత్ సమిట్‎కు హాజరు

నవంబర్ 14న హైదరాబాద్‎కు రాహుల్..ఖర్గేతో కలిసి భారత్ సమిట్‎కు హాజరు

హైదరాబాద్, వెలుగు: భారత్ సమిట్ 2026లో పాల్గొనేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 14న హెచ్‌ఐసీసీలో జరిగే అంతర్జాతీయ సదస్సు ముగింపు సభకు ఆయన, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, కొత్త ప్రపంచ విధానాల రూపకల్పన లక్ష్యంగా నవంబర్ 12 నుంచి 14 వరకు హెచ్‌ఐసీసీ, హైటెక్స్ వేదికల్లో ‘భారత్ సమిట్ 2026–తెలంగాణ రైజింగ్’ నిర్వహించనున్నారు.

80 ఏండ్ల స్వాతంత్ర్య స్ఫూర్తి, జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా విధానకర్తలు, మేధావులు, వ్యాపార దిగ్గజాలు, హక్కుల కార్యకర్తలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతోపన్యాసం చేయనున్నారు.

నవంబర్ 13న ‘నావిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్’ ప్లీనరీలో ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రసంగిస్తారు. తొలి రోజు వెల్‌‌కమ్ డిన్నర్‌‌లో పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా, ఎంపీ ప్రణితి షిండే, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు.

మూడు రోజుల పాటు ఏఐ, క్లౌడ్ క్యాపిటలిజం, వాతావరణ మార్పులు, జెండర్ జస్టిస్, విదేశాంగ విధానాలపై చర్చలు జరగనున్నాయి. వీటిలో సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్, మనీశ్ తివారీ, పవన్ ఖేరా, ఆనంద్ శర్మ, రేణుకా చౌదరి, కన్హయ్య కుమార్, సుప్రియ శ్రీనతే పాల్గొంటారు. నెదర్లాండ్స్, ఇటలీ, బ్రెజిల్, థాయిలాండ్, జపాన్, అమెరికా, కాంగో తదితర దేశాల మాజీ మంత్రులు, ప్రతినిధులు ప్రసంగించనున్నారు.

తెలంగాణ రైజింగ్‌‌పై ప్రత్యేక ప్యానెల్స్

రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటేలా ‘తెలంగాణ రైజింగ్’ పేరిట ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నారు. ‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’పై మంత్రి డి. శ్రీధర్ బాబు, ‘ఎకనామిక్ జస్టిస్’పై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడనున్నారు. ‘సోషల్ జస్టిస్’ ప్యానెల్‌‌లో మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కంచ ఐలయ్య పాల్గొంటారు.

సంక్షేమ విధానాలపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి, ఫెడరలిజంపై మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కల్చర్ అండ్ సొసైటీపై ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో చర్చలు జరగనున్నాయి. యూత్ అండ్ స్పోర్ట్స్ ప్యానెల్‌‌లో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పాల్గొంటారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక రౌండ్‌‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు.

ప్రపంచ పెట్టుబడులు, ఉమ్మడి కార్యాచరణ లక్ష్యం

గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ దేశాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, పర్యావరణ పరిరక్షణకు ఉమ్మడి కార్యాచరణ రూపకల్పన ఈ సదస్సు లక్ష్యాలు. ముగింపు వేదికగా ప్రపంచ ప్రగతిశీల శక్తుల సమన్వయం కోసం ‘అవర్ వరల్డ్ ఇన్‌‌స్టిట్యూట్’ను పోర్చుగల్ మాజీ మంత్రి డాక్టర్ మరియా జోవో రోడ్రిగ్స్, సల్మాన్ ఖుర్షీద్ ప్రారంభించనున్నారు.

హైటెక్స్‌‌లో కాంగ్రెస్ 140 ఏండ్ల చరిత్ర, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ, విద్యా హక్కు వంటి హక్కుల ఆధారిత సంక్షేమ పథకాలపై ‘ఇండియా అండ్ ది వరల్డ్’ ఎక్స్‌‌పో ఏర్పాటు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులకు తెలంగాణ కళలు, సంస్కృతి, చేనేత ఉత్పత్తులను పరిచయం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.