తుమ్మిడి హెట్టి కట్టి ఉంటే కరువు ఉండేదే కాదు..కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తి పడ్డరు: మంత్రి వివేక్ వెంకటస్వామి

తుమ్మిడి హెట్టి కట్టి ఉంటే కరువు ఉండేదే కాదు..కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తి పడ్డరు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కాళేశ్వరం పేరుతో రీడిజైన్ ​చేయడం చారిత్రక తప్పిదం 
  •     బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రైతులకు సూచన
  •     జైపూర్, కోటపల్లి, చెన్నూరు, మందమర్రిలలో పర్యటన

కోల్​బెల్ట్/జైపూర్/కోటపల్లి, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు(ప్రాణహిత–-చేవెళ్ల సుజల స్రవంతి) కట్టి ఉంటే ఇప్పుడు కరువు ఉండేదే కాదని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి అన్నారు. కమీషన్లకు కేసీఆర్ కక్కుర్తి పడ్డారని, కాళేశ్వరం పేరుతో రీడిజైన్​చేయడం చారిత్రక తప్పిదమని ఆరోపించారు. రూ.22 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి ప్రజాధనం లూటీ చేశారని, మేడిగడ్డ మూడేండ్లకే కుంగిందని మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్, కోటపల్లి, చెన్నూరు మండలాల్లో, మందమర్రి టౌన్​లో మంత్రి పర్యటించారు. 

రూ.1.60 కోట్లతో కోటపల్లి హైస్కూల్​ఆవరణలో ఎస్సీ హాస్టల్ బిల్డింగ్, కేజీబీవీలో అదనపు తరగతి గదులకు భూమిపూజ చేశారు. విద్యార్థులకు షూలు,ప్లేట్లు అందించారు. జైపూర్ హైస్కూల్లో ఆధునిక బాక్స్ క్రికెట్ కోర్టును ప్రారంభించారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కాకా వెంకటస్వామి విజ్ఞప్తి మేరకు వైఎస్ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద రూ.11 కోట్ల అంచనాతో ప్రాణహిత-–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని, బీఆర్ఎస్​దీన్ని కట్టి ఉంటే కరువును దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 170 టీఎంసీలు పంప్​చేస్తే.. అందులో 70 టీఎంసీలు కిందికి విడిచిపెట్టడం వల్ల వృథాగా సముద్రంలో కలిశాయన్నారు. కాళేశ్వరం నీళ్లకు సంబంధించి బీఆర్ఎస్​నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మొద్దని కోరారు. ఎల్ నినో నేపథ్యంలో నీటిని, విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు.

గ్లోబల్​ సమ్మిట్​కు ఏర్పాట్లు

ఫ్యూచర్​ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీ శాశ్వత భవనాల్లో డిసెంబర్​7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్​ తెలంగాణ గ్లోబల్​ సమ్మిట్​కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివేక్​వెంకటస్వామి చెప్పారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రం ‘సర్’ పేరుతో 13 కోట్ల ఓట్లను తొలగించిందని, రాహుల్​గాంధీ నేతృత్వంలో ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు దేశవ్యాప్త మద్దతు లభించిందని తెలిపారు. 

ప్రభుత్వ విద్యాసంస్థల్లో సదుపాయాలు కల్పిస్తాం 

ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివేక్ అన్నారు. 20 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​ అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని, జైపూర్​హైస్కూల్​విద్యార్థులు కోరినట్లు ఒక క్రికెట్, ఒక ఆస్ట్రో టాఫ్ మంజూరు చేశామని చెప్పారు. తాను చిన్నతనంలో క్రికెట్ ఆడేవాడినని, ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా తనదే భారీ స్కోర్ ఉండేదని, మెడికల్ కాలేజీలోనూ ప్రత్యేక గుర్తింపు పొందానని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.

మరో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 
రాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేశామని మంత్రి వివేక్​తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 2 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. చెన్నూరులో నిర్మించిన 100 పడకల దవాఖానను త్వరలో ప్రారంభిస్తామన్నారు. చెన్నూరులో చిరు వ్యాపారులకు రూ.1.2 కోట్లతో షాప్​లు నిర్మిస్తున్నామని, ఇతరుల కోసం మరో 50 షాప్​లు కట్టిస్తామన్నారు. రూ.80 కోట్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, మందమర్రి, జైపూర్, భీమారం, కోటపల్లి తహసీల్దార్లు సత్తీశ్​, వనజారెడ్డి, సదానందం, రాఘవేంద్రరావు, ఏసీపీలు కిరణ్​కుమార్, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.