- ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు పూర్తి చేసింది. మార్చి రెండో వారంలోగా ప్రధాన పరీక్షలు ముగించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రెండు షెడ్యూళ్లను ప్రభుత్వానికి పంపించింది. సర్కారు ఆమోదం రాగానే ఒకటి, రెండు రోజుల్లో అధికారిక షెడ్యూల్ విడుదల చేయనుంది.
పరీక్షల మధ్య తగినన్ని సెలవులు ఇచ్చేలా ఒక షెడ్యూల్, ఎలాంటి సెలవులు లేకుండా రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించేలా మరో షెడ్యూల్‌ను ప్రతిపాదించింది. పరీక్షల మధ్య ఎక్కువ గ్యాప్ ఇస్తే జేఈఈ ప్రిపరేషన్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సెలవులు లేకుండా పరీక్షలు నిర్వహించే ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈసారి కొత్తగా ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులిద్దరికీ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు సంవత్సరాలు కలిపి సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
