ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసన్ కోట్.. సంపూర్ణ మద్దతు తెలిపిన అరబ్ పార్టీలు 

ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసన్ కోట్.. సంపూర్ణ మద్దతు తెలిపిన అరబ్ పార్టీలు 

జెరూసలెం: ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. దీర్ఘకాలికంగా దేశ రాజకీయాలను శాసిస్తున్న బెంజమిన్ నెతన్యాహుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నాయకుడు, ఆర్మీ మాజీ చీఫ్ గాడి ఐసెన్​కోట్ ప్రధాని పదవి రేసులో అనూహ్యంగా బలమైన అభ్యర్థిగా అవతరించారు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వివిధ పక్షాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుండటంతో ఇజ్రాయెల్ రాజకీయాలలో ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి కానీ, అటు ప్రతిపక్ష ఐసెన్ కోట్ కూటమికి కానీ మెజారిటీ దక్కని విషయం తెలిసిందే. 

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఇరు పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అరబ్ పార్టీల మద్దతు తప్పనిసరిగా మారగా.. వాటి సపోర్ట్ తీసుకునే ప్రశ్నే లేదంటూ నెతన్యాహు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే అరబ్ పార్టీల కూటమి గాడి ఐసన్ కోట్ వైపు నిలిచింది. నెతన్యాహు అనుసరిస్తున్న కఠిన విధానాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ఆయనను అధికారంలో నుంచి గద్దె దించడమే లక్ష్యంగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

67 మంది శాసనసభ్యుల మద్దతు..

ఇజ్రాయెల్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 120 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 61 స్థానాల సాధారణ మెజారిటీ అవసరం. అయితే, సంప్రదింపుల ప్రక్రియలో గాడి ఐసెన్ కోట్ వైపు ఏకంగా 67 మంది సభ్యులు మొగ్గు చూపారు. సంఖ్యాపరంగా చూస్తే ఐసెన్ కోట్ కూటమి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించడంతో, దశాబ్దాల నెతన్యాహు శకం ముగియనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది.

ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం ప్రకటన

గాడి ఐసెన్​కోట్ కూటమి పార్టీల మధ్య ఇంకా కొన్ని అంశాలపై భేదాభిప్రాయాలు ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై తక్షణం నిర్ణయం తీసుకోలేనని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హర్జోగ్ పేర్కొన్నారు. అన్ని పక్షాలతో చర్చలు జరిపిన తర్వాత ఆదివారం తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు.