సనా: నైరుతి యెమెన్‌లోని ఓ మార్కెట్‌పై శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది మృతి చెందారని, 40మంది గాయపడ్డారని హౌతీ వర్గాలు వెల్లడించాయి. మార్కెట్ లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దాడి జరిగిందని, దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని తెలిపాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. హౌతీ నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో వైమానిక దాడి ఎవరు చేశారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
