భార్యపై కసితో ఏడుగురిని చంపిన భర్త.. 15–20 రోజుల్లోనే వరుస హత్యలు

భార్యపై కసితో ఏడుగురిని చంపిన భర్త.. 15–20 రోజుల్లోనే వరుస హత్యలు

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. కుటుంబ కలహాలతో క్యాబ్ డ్రైవర్ ఇందూశేఖర్ అలియాస్ శేఖర్ తన భార్యతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేశాడు. 15–20 రోజుల వ్యవధిలో రాజరాజేశ్వరి నగర్‌‌‌‌లోని ఇంట్లోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కర్నాటకలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. 

నందిహిల్స్ సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని వెలికితీయగా, మిగతా ఆరుగురి డెడ్ బాడీల కోసం వెతుకుతున్నారు. నవంబర్ 3న నమోదైన మిస్సింగ్ కేసు విచారణలో ఈ హత్యల గుట్టు బయటపడింది. మృతులను నిందితుడి భార్య సునీత, అత్త రూపవతి, బావలు శివకుమార్, శంకర్, వారి భార్యలు దివ్య, నళిని, ఏడేళ్ల పునీత్‌‌‌‌గా గుర్తించారు. 

మొదట భార్యను మిక్సీ రాయితో కొట్టి చంపిన శేఖర్.. ఆ తర్వాత పార్టీ పేరుతో బావలను ఇంటికి పిలిచి హతమార్చాడు. అనంతరం మిగతావారినీ వరుసగా కడతేర్చాడు. భార్య కుటుంబంపై కసితోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్యల తర్వాత ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా కెమికల్స్‌‌‌‌తో శుభ్రం చేశాడు. 

మృతదేహాలను కారులో తీసుకెళ్లి నందిహిల్స్, చర్మాడి ఘాట్ వంటి ప్రాంతాల్లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతుల ఫోన్ల నుంచి మెసేజ్‌‌‌‌లు పంపిస్తూ వారంతా ఆల్ ఇండియా ట్రిప్‌‌‌‌లో ఉన్నట్లు నమ్మించాడు. మరో 11 ఏళ్ల బాలుడిని కూడా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. అయితే, ఈ దారుణాన్ని కళ్లారా చూసిన బాలుడు నిందితుడి ఘాతుకాన్ని బయటపెట్టాడు.