న్యూఢిల్లీ: ఇటలీలో పుట్టి పెరిగిన సోనియా గాంధీ.. రాజీవ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఇక్కడి వంటకాలకు ఎలా అలవాటు పడ్డారన్న ఆసక్తికర విషయాలు ఆమె ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ద్వారా వెలుగుచూస్తున్నాయి. రాజీవ్ గాంధీతో కలిసి సోనియా తొలిసారి తందూరీ చికెన్ రుచి చూశారట. ఎర్రగా సగం కాలినట్టు ఉన్న ఆ చికెన్ తినగానే అందులోని ఘాటైన కారానికి తన నోరు మండిపోయిందట.
ఇలాంటి అనేక విషయాలను సోనియా తన ఆత్మకథలో రాసుకున్నారు. ఈ బుక్ నవంబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇండియా శుక్రవారం సోషల్ మీడియాలో పుస్తకంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకుంది. ముఖ్యంగా గాంధీ కుటుంబంలో రోజూ భోజనంలో కందిపప్పు తప్పనిసరిగా ఉండేదని ఆమె ఆత్మకథలో వెల్లడించారు.
ఇంట్లో సాధారణంగా అన్నం, పుల్కాలు, కూరతో పాటు మటన్, చేపలు లేదా చికెన్ వడ్డించేవారని పేర్కొన్నారు. అయితే వీటన్నింటితో పాటు ప్రతిరోజూ కందిపప్పు (అర్హర్ దాల్) తప్పనిసరిగా ఉండేదని తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తున్న అరుదైన ఫొటోను కూడా ప్రచురణ సంస్థ విడుదల చేసింది. అందులో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీతో పాటు సోనియా కనిపిస్తున్నారు.
పరిచయమేలేని దేశం సొంత ఇల్లుగా..
ఒక దేశం మన జీవితంలో భాగంగా ఎలా మారుతుందనే విషయాన్ని సోనియా తన ఆత్మకథలో వివరించారు. తొలుత అపరిచితంగా అనిపించిన విషయాలే క్రమంగా అలవాటుగా మారతాయని, ఆ అలవాట్లపై ప్రేమ పెరిగి చివరకు బాధ్యతగా మారుతుందని పేర్కొన్నారు. అదే నిజమైన అనుబంధమని అభివర్ణించారు. భారతదేశానికి వచ్చిన తొలినాళ్లలో భాష, దుస్తులు, ఆహారం, సంప్రదాయాలు అన్నీ కొత్తగా అనిపించినా క్రమంగా వాటిని తన జీవితంలో భాగం చేసుకున్నట్లు వివరించారు.
