ఖుంటీ: జార్ఖండ్‌లోని ఖుంటీ జిల్లా కర్రా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ట్రక్కు.. రోడ్డు పక్కన నిలబడిన జనంపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కర్రా–తోర్పా ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ఒక స్కూటర్ ప్రమాదానికి గురికావడంతో, వాహనదారుడికి సాయం చేయడానికి గ్రామస్తులు రోడ్డు పక్కన గుమిగూడారు.
అదేసమయంలో తోర్పా వైపు నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల బాలుడు ఖుంటీ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనను నిరసిస్తూ గ్రామస్తులు శుక్రవారం ఉదయం కర్రా రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేయాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, భారీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
