బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు..రూ. 5 వేల నుంచిరూ. 7 వేలకు పెంచిన ప్రభుత్వం : మంత్రి పొన్నం

బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థుల స్టైపెండ్ పెంపు..రూ. 5 వేల నుంచిరూ. 7 వేలకు పెంచిన ప్రభుత్వం : మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: బీసీ స్టడీ సర్కిల్స్ లోని సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ప్రతినెలా అందించే స్టైపెండ్ ను 5 వేల నుంచి 7 వేల రూపాయలకు , ఫౌండేషన్ కోర్స్ విద్యార్థులకు రూ. 1000  నుంచి 1500 కు స్టైపెండ్ పెంచినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు. వీటితో పాటు వార్షిక బుక్ ఫండ్ 5 నుంచి 10 వేలకు పెంచినట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్ లలో పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. 

బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఏటా ఔత్సాహిక యువతీయువకులకు మెరిట్ ప్రాతిపదికన పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తున్నామన్నారు. వారికి ప్రభుత్వపరంగా అందజేసే స్టైపెండ్ ను  గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచామని మంత్రి వెల్లడించారు. కోచింగ్ తీసుకుంటున్నవారిలో ఎక్కువమంది సివిల్ సర్వీసెస్ సాధించేలా చేసేందుకు ఇటీవలే ఒక నిపుణుల కమిటీని నియమించామని వివరించారు. ఆ కమిటీ బీసీ స్టడీ సర్కిల్ ల అభివృద్ధికి, మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నో సూచనలు చేసిందని, అందులో కీలకమైన స్టైపెండ్ పెంపును తక్షణమే అమలు చేసామని తెలిపారు. ప్రతి బీసీ స్టడీ సర్కిల్ భవనంలోని గోడలపై పోటీ పరీక్షలకు సంబంధించిన విజ్ఞాన  విషయాలను, గ్రాఫ్ లు, మ్యాప్ లను  పెయింటింగ్ రూపంలో వేయాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.