NEHS రోగులకు అడ్మిషన్లు నిరాకరిస్తే సహించం..ఆస్పత్రులకు సీఎస్ వార్నింగ్

NEHS రోగులకు అడ్మిషన్లు నిరాకరిస్తే సహించం..ఆస్పత్రులకు సీఎస్ వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఎన్‌‌‌‌ఈహెచ్‌‌‌‌ఎస్) అమలులో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని  సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన ఎన్‌‌‌‌ఈహెచ్‌‌‌‌ఎస్ బోర్డు సమావేశంలో ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి పథకం అమలు తీరును సమీక్షించారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్లు దక్కకపోవడం, వైద్య చికిత్సల్లో జాప్యం, బిల్లుల చెల్లింపులపై ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన సమస్యలపై యశోద, అపోలో, కిమ్స్ తదితర కార్పొరేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో సీఎస్ ఆన్‌‌‌‌లైన్ ద్వారా మాట్లాడి వివరణ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌‌‌‌ఈహెచ్‌‌‌‌ఎస్ పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లకు అడ్మిషన్లు నిరాకరించకూడదని తేల్చిచెప్పారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న పాత బిల్లులను త్వరగా పరిష్కరించడంతోపాటు కొత్త చికిత్స బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేయాలని సూచించారు. 

వచ్చే వారంలో చేయూత దరఖాస్తులు తేల్చండి

జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సీఎస్ సంజయ్ జాజు పిలుపునిచ్చారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు జిల్లాల్లోని బడులు, దవాఖానలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. ఎల్‌‌‌‌నినో పరిస్థితులపై సమీక్షిస్తూ.. రాష్ట్రంలోని 565 మండలాల్లో ఆవాసాల వారీగా తాగునీటిపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు.

సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయినందున సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ప్రభుత్వం రూ.120 కోట్లు కేటాయించిందని, కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు పక్షం రోజులకోసారి తాగునీటి సరఫరాను సమీక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 365 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించామని,  వీబీ–జీ రామ్ జీ కింద రోజుకు 5,38,215 పనిదినాలు కల్పిస్తున్నామన్నారు.  చేయూత పథకం కింద అందిన 5.9 లక్షల దరఖాస్తు పరిశీలన ముగిసిందన్నారు.