నాలుగు కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్లు... తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు..!

నాలుగు కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్లు... తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు..!
  • నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హన్మకొండ, వరంగల్​లో నిర్మాణాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఐదు కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఒక్కో చోట 480 ఫ్లాట్ల చొప్పున జీ ఫ్లస్ 5 ఫోర్లలో మొత్తం 2,400 ఫ్లాట్లు నిర్మించనున్నారు. 

ఇందుకు రూ.204 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్ శుక్రవారం జీవో 579 జారీ చేశారు. అఫర్టబుల్ హౌసింగ్ పాలసీ కింద క్యూర్ తోపాటు మున్సిపల్ కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ టవర్ల పేరుతో ఫ్లాట్లను నిర్మించనున్నారు. 

‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సక్సెస్​ చేయాలి:  ఎండీ వీపీ గౌతమ్

రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లలో  ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు.  ఇప్పటికే పూర్తి అయిన రెండు లక్షల ఇందిరమ్మ ఇండ్ల వద్ద దీపాలు వెలిగిస్తూ పండుగను మరింత శోభాయమానం చేస్తున్నట్లు తెలిపారు. 

లబ్ధిదారులందరూ తమ ఇండ్లు కనిపించేలా, కుటుంబంతో సహా జరుపుకుంటున్న పండుగ ఫొటోలను ఇందిరమ్మ ఇండ్లు మొబైల్ యాప్  ద్వారా తీసి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ ఉత్సవాల్లో లబ్ధిదారులందరూ పాల్గొనాలని కోరారు.