న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరగడానికి పెద్ద పెద్ద కార్లు, విలాసవంతమైన జీవనశైలి కలిగిన ధనవంతులే ప్రధాన కారణమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పేదవాళ్లు కాలుష్యాన్ని సృష్టించరని.. పైగా పొల్యూషన్ పెరగడం వల్ల నష్టపోయేది, బాధపడేది వారేనని పేర్కొంది. ధనవంతులు ఎయిర్ ప్యూరిఫైర్లతో తమను తాము కాపాడుకోగలరు కానీ పేదలు బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తూ విషపూరిత గాలిని పీల్చాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేసింది.
ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ వి. మోహనా బెంచ్ శుక్రవారం విచారించింది. అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ వాదిస్తూ.. ఢిల్లీలో గాలి నాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరీలో ఉందని, ఇక్కడి గాలి పీల్చడం రోజుకు 30 సిగరెట్లు కాల్చడంతో సమానమని కోర్టుకు తెలిపారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చివేయడం వల్ల 14% వాయు కాలుష్యం జరుగుతున్నదని వివరించారు.
టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ ఎక్కువసేపు ఆగడం వల్ల కూడా కాలుష్యం పెరుగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ.. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలతో కూడిన ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. బెంచ్ స్పందిస్తూ.. ఆంక్షల వల్ల సమస్య పరిష్కారంకాదని తెలిపింది. కాలుప్యంపై ప్రజల్లో అవగాహన చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. కాలుష్యానికి పేదలను బాధ్యులను చేయవద్దని, ధనవంతుల హై-ఎండ్ కార్లు, విలాసవంతమైన జీవనశైలే ఈ సంక్షోభానికి అసలు కారణమని తెలిపింది. పంట వ్యర్థాల కొనుగోలు ధరలను ముందే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అమల్లోకి స్టేజ్-3 ఆంక్షలు
దీపావళి పండుగ వేళ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి కాలుష్యం(ఏక్యూఐ 382 ) విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ)’ మూడో దశ నిబంధనలను శుక్రవారం అమలులోకి తెచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్టేజ్-3 ఆంక్షలను అమలు చేయనున్నట్లు ఢిల్లీలోని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) వెల్లడించింది.
జీఆర్ఏపీ స్టేజ్-3 నిబంధనల ప్రకారం.. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మెరుగయ్యేదాకా గాలిలో దుమ్ము, ధూళి కలవకుండా ఆంక్షలు అమలుచేస్తారు. మట్టి తవ్వకాలు, పైలింగ్(పునాది పనులు), కాలువలు త్రవ్వడం, కాంక్రీట్ ప్లాంట్ల వంటి అన్నిరకాల నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపివేయాలి. ఇసుక, సిమెంట్, కంకర, మట్టి వంటి నిర్మాణ సామగ్రిని ఒక చోటు నుంచి మరోచోటుకి తీసుకెళ్లడాన్ని పూర్తిగా ఆపేయాలి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిర్మాణ సామగ్రి రవాణాను నిషేధిస్తారు.
అలాగే.. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోకి బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లకు ఎంట్రీ ఉండదు. ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్ బస్సులు నగరంలోకి రాకుండా ఆంక్షలు పెట్టారు. క్లీన్ ఫ్యూయల్ వాడని స్టోన్ క్రషర్లు, మైనింగ్ పనులు, హాట్ మిక్స్ ప్లాంట్లను మూసివేస్తారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించారు. చిన్న పిల్లలను కాలుష్యం నుంచి రక్షించడానికి 5వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తారు.
ఊపిరితిత్తులు దెబ్బతినకుండా చూసుకోండి: డాక్టర్లు
ఢిల్లీలో ప్రస్తుతం గాలి నాణ్యత బాగా క్షీణించించింది. మొత్తం ఏక్యూఐ 391కి చేరడంతో నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. పంట వ్యర్థాల దహనం, టపాసులు కాల్చడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్యం 'తీవ్ర' స్థాయికి చేరింది. ఈ నెల 9 వరకు ఉదయం వేళల్లో తేలికపాటి పొగమంచు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు, దీపావళి వేళ పెరిగే వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు ఢిల్లీ వాసులను హెచ్చరించారు. వృద్ధులు, ఆస్తమా, సీఓపీడీ, గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారు కాలుష్య బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. ఉదయం పూట చల్లని గాలిలో వాకింగ్ కు వెళ్లే అలవాటును మార్చుకోవాలని, కిటికీలు మూసి ఉంచి ఇంటి లోపల ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
