- వారంలో 1,141 తనిఖీలు..90 కేసులు
- తూనికలు, కొలతల శాఖతనిఖీల్లో మరో 280 కేసులు
హైదరాబాద్, వెలుగు: బియ్యం అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై సివిల్ సప్లయ్స్శాఖ కొరడా ఝళిపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు వారం రోజుల పాటు 1,141 తనిఖీలు నిర్వహించారు. ఇందులో 55 కేసులు, 35 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
మరోవైపు లీగల్ మెట్రాలజీ అధికారులు 1,545 తనిఖీలు నిర్వహించి 280 కేసులు నమోదు చేశారు. మార్కెట్లో బియ్యం ధరల అదుపు కోసం ప్రభుత్వం గరిష్ట రిటైల్ ధరలను నిర్ణయించింది. బీపీటీ/కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్/తెలంగాణ సోనా కిలో రూ.74, హెచ్‌ఎంటీ/జేఎస్‌ఆర్ రకం బియ్యం కిలో రూ.79కు మించకుండా విక్రయించాలని స్పష్టం చేసింది.
తూకాల్లోనూ భారీ మోసాలు
తనిఖీల సందర్భంగా వ్యాపారులు అనుసరిస్తున్న పలు అక్రమ పద్ధతులను అధికారులు గుర్తించారు. బస్తాలో 25 కిలోల బియ్యం మాత్రమే నింపి, దానిపై 26 కిలోలుగా ముద్రించిన లేబుల్ అతికించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అసలు ధర కనిపించకుండా పాత ధరలపై అధిక ధరల స్టిక్కర్లు అంటించడం, రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.
జీఎస్టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రేషన్ బియ్యాన్ని పదేపదే అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు హెచ్చరించారు.
