- పంచాయతీరాజ్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర
- అక్టోబర్ 9 నుంచే అమలు చేస్తూ సర్కారు జీవో జారీ
హైదరాబాద్, వెలుగు: పంచాయతీల సొంత ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలలో కాకుండా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం–2026 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చట్టాన్ని అక్టోబర్ 9 నుంచే అమల్లోకి తెస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ జీవో జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70, సబ్-సెక్షన్ (3)కు ప్రభుత్వం సవరణ చేసింది.
ఈ సవరణ ప్రకారం.. గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద వచ్చే అన్ని నిధులు, గ్రాంట్లను సమీపంలోని నేషనలైజ్డ్ బ్యాంక్, కో-ఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం పొందిన ఈ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా వాటి ఖాతాల్లోనే జమ చేసేందుకు తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2026ను క్షేత్రస్థాయిలో వెంటనే అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్య ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు కమిషనరేట్ కార్యాలయం నుంచి మెమో జారీ చేశారు.
గతంలో గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని కూడా ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగేది. జీపీలకు డబ్బులున్నా.. ట్రెజరీల నుంచి డ్రా చేసేందుకు అనుమతులు, ప్రక్రియల పేరుతో సర్పంచులు, కార్యదర్శులు నిరీక్షించాల్సి వచ్చేది.
పల్లెల ఆర్థిక స్వావలంబనకు ముందడుగు: మంత్రి సీతక్క
పంచాయతీరాజ్ చట్ట సవరణ అమలు ఉత్తర్వులు వెలువడటంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. పల్లెల ఆర్థిక స్వావలంబనకు, స్వయం పాలనకు కీలక ముందడుగని పేర్కొన్నారు. గ్రామాల అవసరాల కోసం స్థానిక ప్రజాప్రతినిధులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా చేయాలనే సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ రావడం వల్ల స్థానికంగా జవాబుదారీతనం పెరగడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
