హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటే కేటీఆర్ కు వెళ్లి పరామర్శించే సమయం లేదుకానీ, పెళ్లి కోసం చెన్నై వెళ్లారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. జనగామకు చెందిన లక్ష్మణ్ గౌడ్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారని స్పష్టం చేశారు. శుక్రవారం చనగాని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. విప్ లను పంపించి బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు సహాయం చేయడంతో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల విషయంలో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఇదయితే...ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు పదవులు అనుభవించి, లక్షల కోట్లు సంపాదించిన బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదన్నారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్ల ఉన్నాయని అధికారికంగా వారే ప్రకటించారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులకు పార్టీ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం చేయాలని సూచించారు.
