లింకన్: న్యూజిలాండ్ టూర్‌లో భాగంగా జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి న్యూజిలాండ్–ఎతో జరగనున్న నాలుగు రోజుల మూడో అనధికార టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా–ఎ తరఫున బరిలోకి దిగుతున్నారు. టెస్ట్‌లకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని ఇండియా మేనేజ్‌మెంట్ సన్నాహాలు చేస్తోంది.
ఆసియా క్రీడల తర్వాత బుమ్రా మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్ ఆడనున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వన్డే సిరీస్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు టెస్ట్ సిరీస్ కోసం అతన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన జడేజా కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. కివీస్–ఎ జట్టులో కీలక పేసర్లు సైమన్ కీన్, ఫ్రేజర్ షీట్ గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది.
