ప్రాణం తీస్తున్న స్టెమీ.. రాష్ట్రంలో 17%  మరణాలకు ఈ గుండెపోటే కారణం

ప్రాణం తీస్తున్న స్టెమీ.. రాష్ట్రంలో 17%  మరణాలకు ఈ గుండెపోటే కారణం
  • రాష్ట్రంలో 17%  మరణాలకు ఈ గుండెపోటే కారణం
  • ‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు
  • గతేడాది 2.82 లక్షల ఈసీజీలు.. 1,299 మందికి స్టెమీ
  • సగం మందికి కూడా అందని థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్
  • ఈ యేడు 6  నెలల్లోనే 389 కేసులు.. సెప్టెంబర్​లోనే 98 మంది
  • వైద్యారోగ్య శాఖ నివేదికలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం మరణాల్లో 17 శాతం ‘స్టెమీ’ (ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్​ ఇన్ఫార్క్ షన్) అనే తీవ్రమైన గుండెపోటు వల్లే సంభవిస్తున్నాయని వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. ఏ రకమైన గుండెపోటు వచ్చిందో తెలియక, సకాలంలో చికిత్స అందకే ఈ మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. 

స్టెమీ బారిన పడినవారికి మొదటి గంటలోనే సరైన చికిత్స అందకపోతే ప్రాణాపాయం తప్పదని డాక్టర్లు చెబుతున్నారు. వైద్య పరిభాషలో ఈ మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌‌సీల నుంచి జిల్లా దవాఖానల దాకా పెద్ద ఎత్తున ఈసీజీ స్క్రీనింగ్‌‌లు చేస్తూ గుండెపోట్లను తొలిదశలోనే గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  

సగం మందికి కూడా అందని ఇంజెక్షన్

స్టెమీ ప్రాజెక్టులో భాగంగా 2025–26లో ప్రభుత్వ దవాఖానల్లో 2,81,997 మందికి ఈసీజీలు తీయగా, 1,299 మందికి స్టెమీ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 532 మందికి మాత్రమే థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగారు. అంటే సగం మందికి కూడా అత్యవసర చికిత్స అందలేదు. ఈ ఏడాది (2026–27) ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో 1.67 లక్షల ఈసీజీలు తీయగా, 389 మందికి స్టెమీ నిర్ధారణ అయింది.

ఇందులో 216 మందికి ఇంజెక్షన్ అందింది. ఈసీజీల సంఖ్య దాదాపు నిలకడగా ఉన్నా, సెప్టెంబర్‌‌లో ఒక్క నెలలోనే 98 స్టెమీ కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల్లో ఇదే అత్యధికం. వాతావరణ మార్పులు, మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి ఆకస్మిక గుండెపోట్లు పెరగడానికి ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు.

గ్యాస్ ట్రబుల్ అనుకుని..

గుర్తించిన ప్రతి బాధితుడికీ గోల్డెన్ అవర్‌‌లో చికిత్స అందకపోవడానికి ప్రధాన కారణం దవాఖానలకు ఆలస్యంగా రావడమేనని తేలింది. ఛాతీలో తీవ్రమైన నొప్పి, విపరీతమైన చెమటలు, దవడ లేదా ఎడమ చేతికి నొప్పి పాకడం వంటి లక్షణాలను చాలా మంది గ్యాస్ ట్రబుల్ అనుకుని నిర్లక్ష్యం చేస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే 108కు ఫోన్ చేసి దగ్గర్లోని దవాఖానకు వెళ్లాలని సూచిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లోని టెలీ–ఈసీజీ నెట్‌‌వర్క్‌‌ను బలోపేతం చేయడంతో పాటు, 108 అంబులెన్సుల్లోనే స్టెమీ నిర్ధారణ, ప్రాథమిక ఇంజెక్షన్లు ఇచ్చే సౌకర్యాన్ని విస్తరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రభుత్వ దవాఖానల్లోని ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌‌ను విస్తరిస్తేనే మరణాలను అరికట్టవచ్చని సూచిస్తున్నారు.

ఏమిటీ స్టెమీ..?

గుండెకు రక్తం, ఆక్సిజన్ సరఫరా చేసే ప్రధాన రక్తనాళం (కరోనరీ ధమని)లో రక్తం గడ్డకట్టి, అది పూర్తిగా మూసుకుపోయినప్పుడు వచ్చే అత్యంత తీవ్రమైన గుండెపోటే స్టెమీ. రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడంతో నిమిషాల్లోనే గుండె కండరం తీవ్రంగా దెబ్బతిని ప్రాణాలకే ముప్పు వస్తుంది. అలాంటి సమయంలో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించేందుకు ఇచ్చే ‘థ్రోంబోలైసిస్’ ఇంజెక్షన్ గోల్డెన్ అవర్‌‌లో అందితే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.