కేరళకు చెందిన 18 నెలల చిన్నారి ఏనుగు కూన 'మాయ' ప్రాణాలను కాపాడేందుకు గుజరాత్ జామ్‌నగర్‌లోని అనంత్ అంబానీకి చెందిన 'వంతార' సంస్థ ముందుకు వచ్చింది. 2 కాళ్లకు తీవ్రమైన ఫ్రాక్చర్లు అయి, కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న ఈ ఏనుగు కూనను అత్యవసర వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ఎయిర్‌లిఫ్ట్ చేశారు. కేరళ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ డాక్టర్ పి. పుగజేంది జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నవంబర్ 5న ఈ ఆపరేషన్ చేపట్టారు. వంతార వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ ప్రత్యేక చొరవ తీసుకుని, తమ సంస్థకు చెందిన అనుభవజ్ఞులైన వెటర్నరీ వైద్యుల బృందాన్ని రంగంలోకి దింపడంతో ఈ తరలింపు సాధ్యమైంది.
గత ఏడాది ఏప్రిల్ 19, 2025న కేరళలోని మలయత్తూరు డివిజన్లో ఈ ఏనుగు కూన తన గుంపును కోల్పోయి ఒంటరిగా దొరికింది. అప్పట్లో పుట్టిన కొద్ది రోజులకే తల్లి పాలు అందక, తీవ్ర నీరసంతో, అనారోగ్యంతో ఉన్న ఆ కూనకు అసిస్టెంట్ ఫారెస్ట్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బినోయ్ సి. బాబు అండ్ టీం ఏడాదికి పైగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. దానికి 'మాయ' అని పేరు పెట్టి సేవలు అందించారు.
అయితే గత జూలై 2026లో ఆడుకుంటూ జారిపడటంతో మాయ భుజానికి తీవ్ర గాయమైంది. ఎంత ఫిజియోథెరపీ చేసినా ఎముకలు మరింత బలహీనపడ్డాయి. గతేడాది అక్టోబర్ నాటికి రెండు కాళ్లలో ఫ్రాక్చర్లు ఏర్పడి, ఛాతి ఇన్ఫెక్షన్తో మంచాన పడింది మాయ. దీంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిపుణుల సలహా కోరారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఏనుగుల వెటర్నరీ నిపుణుడు డాక్టర్ కుశాల్ కొన్వర్ శర్మ, వంతార హెడ్ వెటర్నరియన్ డాక్టర్ యదురాజ్ ఖడ్బేకర్ సంయుక్తంగా పరిశీలించి.. ఇదొక పారాథైరాయిడ్ సమస్య కావచ్చని గుర్తించారు.
ALSO READ : ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ రీలాంచ్!
మాయకు ప్రాణాపాయం తప్పించేందుకు వంతార అత్యాధునిక లైఫ్-సపోర్ట్ సిస్టమ్‌తో కూడిన విమానంలో జామ్‌నగర్ తరలించింది. ఆమె వెంట డాక్టర్ బినోయ్, సంరక్షకుడు నిఖిల్ బాబు కూడా వెళ్లారు. జామ్‌నగర్‌లోని వంతార ఆసుపత్రిలో మాయకు నిపుణుల పర్యవేక్షణలో అధునాతన చికిత్స, హైడ్రోథెరపీ అందజేయనున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత మాయను తిరిగి కేరళలోని అభయారణ్యానికి పంపిస్తామని.. కేరళ ప్రభుత్వమే పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. మూగజీవి ప్రాణాలను కాపాడేందుకు వంతార చేస్తున్న ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
