శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఈసారి డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఇందుకు సంబంధించి కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ. అయితే ఈ పది రోజుల్లో భక్తులు ఎప్పుడు, ఎలా దర్శనం చేసుకోవాలి..? ఏ రోజుల్లో టోకెన్లు తప్పనిసరి..? టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి ఎప్పుడు అనుమతిస్తారు? వంటి అంశాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది.
తొలి మూడు రోజులు ఆన్లైన్ ఈ-డిప్ ద్వారా SSD టోకెన్లు జారీ చేసి, మిగిలిన ఏడు రోజులు సర్వదర్శనం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది టీటీడీ. ఈ క్రమంలో తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈసారి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని... డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో ఆన్లైన్ ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ దర్శన టోకెన్లు కేటాయించాలని... డిసెంబర్ 23 నుంచి 29వ తేదీ వరకు ఏడు రోజులపాటు సర్వదర్శనం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సీహెచ్ వెంకయ్య చౌదరి.
డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వదర్శనం భక్తులకు దర్శన అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రికార్డు స్థాయిలో 7 లక్షల 83 వేల మంది భక్తులకు దర్శనం కల్పించామని... ఈసారి కూడా అదే స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
