E20 కాస్తా 420గా మారింది: E20 పెట్రోల్ కల్తీపై రాహుల్ సంచలన ట్వీట్

E20 కాస్తా 420గా మారింది: E20 పెట్రోల్ కల్తీపై రాహుల్ సంచలన ట్వీట్

న్యూఢిల్లీ: E20 పెట్రోల్‎లో ఇథనాల్ 20 శాతానికి మించి ఉందన్న కర్నాటక ప్రభుత్వ రిపోర్ట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ అంశంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం 7 జిల్లాల నుంచి సేకరించి ల్యాబ్‌కు పంపిన 14 పెట్రోల్ నమూనాలలో 11 శాంపిల్స్ 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ కలిగి ఉన్నట్లు తేలిందని రిపోర్ట్స్‎ను షేర్ చేశారు. ఈ నివేదికలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్‎లో 31.2, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సేకరించిన పెట్రోల్‎లో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు తేలిందన్నారు. 

ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితి మించి ఉన్న ఇథనాల్ పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నాయని అన్నారు. ప్రజల వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. E20 కాస్తా 420గా మారిందని కేంద్ర ప్రభుత్వ ఇథనాల్-బ్లెండింగ్ కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలైన IOCL, HPCL, BPCL, నయారా, షెల్ వంటి అన్ని ఇంధన కంపెనీలు పరిమితిని మించి ఇథనాల్‌ను కలుపుతున్నాయని.. వారి సొంత ల్యాబ్ నివేదికల్లో ఈ సమాచారాన్ని దాస్తున్నాయని ఆరోపించారు. 

ప్రజలు దగ్గర నుంచి ఖరీదైన పెట్రోల్‌కు డబ్బులు వసూల్ చేస్తూ.. ట్యాంకుల్లో మాత్రం ఇథనాల్ నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ వాహనాలు ఇంత ఎక్కువ ఇథనాల్‌ను తట్టుకోలేవని.. దీనివల్ల మైలేజీ తగ్గిపోవడమే కాకుండా ఇంజన్లు పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న పెట్రోల్‌లో అసలు ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రమాణాలకు మించి ఇథనాల్ ఉన్న పెట్రోల్ విక్రయిస్తోన్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. 

ALSO READ : వైట్‌హౌస్‌లో భారతీయులతో కలిసి ట్రంప్ దీపావళి సంబరాలు

 E20 పెట్రోల్‏లో 31 శాతం ఇథనాల్: కర్నాటక సర్కార్

ఆయిల్ కంపెనీలు విక్రయిస్తున్న పెట్రోల్‌‌‌‌‌‌‌‌లో నిబంధనలకు విరుద్ధంగా ఇథనాల్ మోతాదు పెరిగినట్లు కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం నిర్దేశించిన 20 శాతం (ఈ20) ఇథనాల్ మిశ్రమానికి బదులుగా, కొన్ని పెట్రోల్ శాంపిల్స్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 31.2 శాతం ఇథనాల్ ఉన్నట్లు తేలిందని ప్రభుత్వం తెలిపింది. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వివిధ కంపెనీల పెట్రోల్ బంకుల్లో నుంచి 63 పెట్రోల్ నమూనాలను సేకరించి పరీక్షించగా.. నిర్దేశిత 20 శాతం పరిమితిని దాటి ఇథనాల్ మోతాదు భారీగా ఉన్నట్లు తేలింది. దీనివల్ల వాహనాల మైలేజ్ పడిపోతుందని, మెయింటెనెన్స్ ఖర్చు భారీగా పెరుగుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కర్నాటక ప్రభుత్వ నివేదికలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వ్యతిరేకించాయి.