కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 135 రన్స్.. గుర్నూర్ డేంజరస్ బౌలింగ్

కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 135 రన్స్.. గుర్నూర్ డేంజరస్ బౌలింగ్

వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు మరోసారి చెలరేగిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయం నూటికి నూరుపాల్లు సరైందని బౌలర్లు నిరూపించారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కివీస్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు కేవలం 134 పరుగులకే (41 ఓవర్లలో) ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 135 పరుగుల లక్ష్యం ఉంది. 

 

బ్రార్ బౌలింగ్ వీరవిహారం.. కెరీర్ బెస్ట్ ఫిగర్స్:

ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ స్పీడ్‌స్టర్ గుర్నూర్ బ్రార్ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల నడుం విరిచాడు. 10 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు (4/30) పడగొట్టి తన వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. కొత్త బంతితో ఊపు ఊపిన ఆకిబ్ నబీ (2/31) కివీస్ ఓపెనర్ల వికెట్లు తీసి మంచి పునాది వేశాడు. వీరికి తోడుగా అన్షుల్ కంబోజ్ (2/25), అక్షర్ పటేల్ (2/28) తలో రెండు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించారు. 

ఒంటరి పోరాటం చేసిన డారెల్ మిచెల్:

న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌లో ఒకవైపు వికెట్లు పడుతున్నా డారెల్ మిచెల్ (104 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 55 పరుగులు) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (31) కాసేపు నిలబడ్డాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ సరిగ్గా రాణించలేకపోయారు.

* కివీస్ వికెట్లు: విల్ యంగ్ (6), హెన్రీ నికోల్స్ (11), టామ్ లేథమ్ (7), కైల్ జెమీసన్ (7), నాథన్ స్మిత్ (3), బ్లెయిర్ టిక్నర్ (2) దారుణంగా విఫలం కాగా.. టిమ్ సైఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్ సున్నాకే (0) పెవిలియన్ చేరారు. 

టీమిండియా టార్గెట్ 135:

ఇప్పటికే సిరీస్‌లో 1–0తో ముందంజలో ఉన్న టీమిండియా ముందు ఇప్పుడు 135 పరుగుల టార్గెట్ ఉంది. వర్షం మళ్లీ ఆటంకం కలిగించకపోతే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్‌లతో కూడిన బలమైన భారత బ్యాటింగ్ లైనప్ ఈ లక్ష్యాన్ని చేధించి 5 వన్డేల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 

న్యూజిలాండ్‌లో వన్డే మ్యాచ్‌లలో భారత పేసర్ల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:

4/23 - జవగళ్ శ్రీనాథ్, ఆక్లాండ్, 2003
4/30 - గుర్నూర్ బ్రార్, వెల్లింగ్టన్, 2026, నేడు*
4/52 - జవగళ్ శ్రీనాథ్, నేపియర్, 1995
4/55 - మహమ్మద్ షమీ, నేపియర్, 2014
4/70 - అర్షదీప్ సింగ్, ఆక్లాండ్, 2026