మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు: కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే పీఆర్‌టీయూ అభ్యర్థిగా సుంకర బిక్షం గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని ప్రయత్నించినట్లు తెలిపారు. బీసీ బిడ్డ అయిన బిక్షం గౌడ్‌కు టికెట్ ఇవ్వాలని తాను సూచించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని, కొడంగల్‌కు అభివృద్ధి పనులు కేటాయించవద్దనేది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారని, తమ నియోజకవర్గానికి నిధులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని, అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్న రాజగోపాల్ రెడ్డి.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను ముఖ్యమంత్రి, మంత్రులు సమానంగా చూడాలని కోరారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడిన ప్రాంతాల్లో మునుగోడు ఒకటని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన తనకు ఉందని తెలిపారు.

మునుగోడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పలుమార్లు కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితిని గుర్తించి మునుగోడుతో పాటు రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన నియోజకవర్గాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి విషయంలో న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.