ఏపీ ఎన్నికలు : 10 ఓట్లతో గెలిచిన వైసీపీ ఎంపీటీసీ.. రీ కౌంటింగ్ లో 3 ఓట్లతో ఓటమి.. రోజా ఆందోళన

ఏపీ ఎన్నికలు : 10 ఓట్లతో గెలిచిన వైసీపీ ఎంపీటీసీ.. రీ కౌంటింగ్ లో 3 ఓట్లతో ఓటమి.. రోజా ఆందోళన

చిత్తూరు జిల్లా, నగరి: నగరి నియోజకవర్గం విజయపురం మండలం ఇల్లెత్తూరు ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. తొలుత వైసీపీ అభ్యర్థి 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించగా, టీడీపీ అభ్యర్థి జయప్రద రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు.దీంతో అధికారులు మరోసారి ఓట్లను లెక్కించగా ఫలితం తారుమారైంది. రీకౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి జయప్రద 3 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు ప్రకటించారు.

అయితే ఈ ఫలితంపై వైసీపీ అభ్యర్థి ఉదయగిరి దేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత జరిగిన కౌంటింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపి లెక్కించారని, మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.మరోవైపు తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని కోరుతున్నప్పటికీ పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఉదయగిరి దేవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వివాదం మరింత ముదరడంతో మాజీ మంత్రి  ఆర్కే రోజా రంగంలోకి దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో ఇల్లెత్తూరు ఎంపీటీసీ ఎన్నికల రీకౌంటింగ్ వ్యవహారం నగరి నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.