విదేశీయులు బస చేస్తే.. 24 గంటల్లో సమాచారం ఇవ్వాల్సిందే.. విశాఖ సీపీ ఆదేశాలు 

విదేశీయులు బస చేస్తే.. 24 గంటల్లో సమాచారం ఇవ్వాల్సిందే.. విశాఖ సీపీ ఆదేశాలు 

విశాఖపట్నంలోని హోటళ్లు, లాడ్జీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు  నగర పోలీస్ కమిషనర్ శంకబద్ర బాగ్చి. విదేశీయులు ఎవరైనా హోటళ్లు లాడ్జీల్లో దిగితే వారికి రాక, పోక వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని  పోలీసులకు  తెలపాలని  హోటళ్ల యజమానులను ఆదేశించారు. విదేశీయులను వివరాలను తప్పనిసరిగా ఆన్​ లైన్​ లో  రిజిస్టర్​ చేయాలని కోరారు. 
విశాఖపట్నం నగరంలోని హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, హోమ్‌స్టేలు, పేయింగ్ గెస్ట్  వంటి వసతి గృహాలలో విదేశీయులు బస చేసిన వెంటనే వివరాల సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశీ పౌరులు వస్తే 24 గంటల్లోపు వారి రాక వివరాలను తిరిగి వెళ్లిన వివరాలను ఫారమ్-III ద్వారా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. ఇందుకోసం నిర్వాహకులు అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ వివరాలు పొందాలని సూచించారు. ఇప్పటివరకు పోర్టల్ లాగిన్ పొందని సంస్థలు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం-2025 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. రూల్స్​ పాటించని వారికి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా ఈ రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు.

విదేశీ పౌరుల కదలికలను పర్యవేక్షించడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను అమలు చేయడం, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలోని అన్ని వసతి గృహాల నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.