ఏపీలో MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు స్టార్ట్.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు స్టార్ట్.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత

అమరావతి: ఆంధ్రప్రదేశ్‏లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శనివారం (నవంబర్ 7) ఉదయం 8 గంటల నుంచి అధికారులు కౌంటింగ్ మొదలుపెట్టారు. 365 లెక్కింపు కేంద్రాల్లో 9,062 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో దాదాపు 40 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. 

కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 19,885 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో CCTV, డ్రోన్, బాడీ వోర్న్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. కాగా, నవంబర్ 5న ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 659 జెడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 77 జెడ్పీటీసీ స్థానాలు, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

దీంతో మిగిలిన 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాలలో సమస్యల వల్ల నవంబర్ 6న 7 చోట్ల రీపోలింగ్ కూడా చేపట్టారు. పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో (82.51 శాతం), అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో (62.01 శాతం) ఓటింగ్ నమోదు అయింది.