ఆ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాం: ఐక్యరాజ్యసమితి స్పెషల్ వీడియో

ఆ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాం: ఐక్యరాజ్యసమితి స్పెషల్ వీడియో

ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఇండియాలో ఒక రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించామని..  పేదరికం నుంచి విముక్తి పొందిన సందర్భంగా విజయం జరుపుకుంటున్నట్లు  ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ హై కమిషనర్ (OHCHR) ఒక వీడియోను విడుదల చేశారు. ఈ చిన్న యానిమేటెడ్ వీడియోను OHCHR కార్యాలయం  యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులోకి తెచ్చింది.  

ఈ వీడియో 1986 డిసెంబర్ 4న ఆమోదించిన ‘రైట్ టు డెవలప్‌మెంట్’పై ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్ 40వ వార్షికోత్సవ సందర్భంగా తయారు చేశారు. కేరళ పిరవి సందర్భంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందినట్లు కేరళం 2025 నవంబర్ 1న ప్రకటించుకుంది.  భారత్‌లో ఇలా ప్రకటించుకున్న మొదటి రాష్ట్రం కేరళం.

వీడియోలో ఏముంది?  

 కేరళం బహుముఖ విధానం అనుసరించి, పేదరికాన్ని కేవలం ఆదాయం లేకపోవడంగా కాకుండా.. పేదరికం అంటే జనాలకు సామర్థ్యం లేకుండా, స్వేచ్ఛ లేకుండా ఉండటంగా నిర్వచించింది. స్థానిక స్వపరిపాలన సంస్థలు, సివిల్ సొసైటీ, మహిళా సంఘాలు కలిసి తీవ్ర పేదరికంలో ఉన్నవారిని గుర్తించాయి. దాదాపు 10 లక్షల మంది పౌరులు ఇండ్లు లేనివారు,  అనారోగ్యంతో చాలా రోజులుగా బాధపడుతున్నవారు, భూమి, ఇల్లు డ్యాక్యుమెంట్లు లేకపోవడం వంటి వాటి ఆధారంగా తమ పరిసరాల్లోని బలహీన కుటుంబాలను గుర్తించారు. లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా, స్థానికంగా సమీక్షించి ఆమోదించారు.

64 వేలకు పైగా కుటుంబాలకు వారి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత మైక్రో ప్లాన్‌ల ద్వారా మద్దతు అందించారు. ప్రభుత్వ శాఖలు ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ వంటి తక్షణ అవసరాలను తీర్చాయి. తర్వాత ఐదేళ్లలో సుస్థిర జీవనోపాధి, సురక్షిత గృహాల ద్వారా దీర్ఘకాలిక మార్గాలను రూపొందించాయి. దీంతో ఆ కుటుంబాలు తమ కాళ్లమీద తాము నిలబడి పేదరికం నుంచి బయటపడ్డాయి. ఈ విజయం ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి నమూనాకు ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది.