దీపావళి సందర్భంగా జనాలకు ఈ మాట చెప్పిచూడండి.. పర్యావరణం కాలుష్యం అవుతుంది.. గ్రీన్ టపాసులు మాత్రమే కాల్చండి.. ప్రభుత్వ అనుమతి తీసుకొని కాల్చండి అని. ఏం సమాధానం వస్తుందో ఊహించి ఉంటారు. కానీ ఆ రాష్ట్రం మాత్రం ఇదే చేస్తోంది. అనుమతి లేకుండా టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష విధిస్తుంది. ఇండియా మొత్తంలో ఇంత కచ్చితమైన నిర్ణయాన్ని, శిక్షను అమలు చేస్తున్న రాష్ట్రం మిజోరం.
మిజోరం రాష్ట్రంలో పటాకుల వాడకంపై కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చని రాష్ట్ర హోం మంత్రి హెచ్చరించారు.
మిజోరం ఫైర్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్, 2026 నిబంధనల గురించి హోం మంత్రి కె. సప్డాంగా శుక్రవారం (2026 నవంబర్ 06) ఐజ్వాల్ లో మీడియాకు వివరించారు. ఈ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆగస్టులో ఆమోదించగా, సెప్టెంబర్‌లో నోటిఫై చేశారు. పేలుడు సంబంధిత పదార్థాల వాడకం, నిల్వ, అమ్మకాలను నియంత్రించడమే ఈ చట్టం లక్ష్యం.
కొత్త రూల్స్ ఇవే:
డిప్యూటీ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా పటాకులు కాల్చడం లేదా దాచుకోవడం శిక్షార్హం
అవసరమైన లైసెన్స్ లేకుండా పటాకులు, సంబంధిత పదార్థాల అమ్మకం ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్, 1884 కింద నిషేధం.
సెక్షన్ 3, 4 ఉల్లంఘిస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా 50 వేల రూపాయల వరకు జరిమానా.
12 ఏళ్లలోపు పిల్లలు ఉల్లంఘిస్తే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై జరిమానా.
ప్రభుత్వ ఉద్యోగులు ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా.
