సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి . తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ ఫ్యాక్టరీ గురించి మాట్లాడానని మంత్రి వివేక్ తెలిపారు.
జువ్వాడి నరసింగరావుకు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం పట్ల మంత్రి వివేక్ హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జువ్వాడి నరసింగరావు తండ్రి రత్నాకర్ రావు ప్రజా జీవితంలో చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ జువ్వాడి నరసింగరావు ప్రజలకు సేవలందిస్తున్నారని మంత్రి వివేక్ అన్నారు.. .. రత్నాకర్ రావు తన తండ్రికి మంచి స్నేహితుడని, తాను రాజకీయాల్లోకి రావాలని అనుకున్న సమయంలో రత్నాకర్ రావు ఎంతో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా ప్రజల కోసం నిధులను ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే విషయంపై అవగాహన కలిగిందని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన రత్నాకర్ రావు ఎన్నో మంచి పనులు చేశారని, అందుకే నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ప్రజా జీవితంలో మంచి పనులు చేసిన నాయకులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.తండ్రి బాటలోనే జువ్వాడి నరసింగరావు నడుస్తున్నారని, ఆయన ఎంతో కష్టపడే వ్యక్తి అని మంత్రి కొనియాడారు. ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉంటారని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఆయనలో ఉందన్నారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ, అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసం నరసింగరావు చేసిన కృషిని గుర్తించిన పార్టీ నాయకత్వం ఆయనకు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఆయన నాయకత్వంలో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ కోసం పోరాడతాం: ఎంపీ వంశీకృష్ణ
మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం జువ్వాడి నరసింగరావు సహకారంతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి జువ్వాడి నరసింగరావు తండ్రి రత్నాకర్ రావు, తన తాతయ్య కాకా మధ్య ఉన్న సన్నిహిత అనుబంధాన్ని చూస్తూ పెరిగానని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారిద్దరూ ఉద్యమ అంశాలపై చర్చించుకోవడం కూడా చూశానని తెలిపారు.
మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జువ్వాడి నరసింగరావు కృషి, సహకారంతో ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే దాదాపు 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు.వెలమ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న జువ్వాడి నరసింగరావుకు ఎంపీ వంశీకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
