పరాగ్వేలో జరిగిన భారీ బ్యాంకింగ్ కుంభకోణం సామాన్య ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో వేగంగా దూసుకుపోయిన 'యునో బ్యాంక్' ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ దేశం తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. కేవలం 65 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో సగం మంది ప్రజలు తమ డబ్బులను బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలోని సగం మంది ప్రజల జోబుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయి, పూట గడవడం కష్టంగా మారింది.
ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ అయిపోవడం, చేతిలో కనీసం రూపాయి కూడా లేకపోవడంతో పరాగ్వే ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిత్యవసర సరుకులు కొనుగోలు చేయడానికి, పిల్లల చదువులకు, చివరికి మందులు తెచ్చుకోవడానికి కూడా డబ్బుల్లేక లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, శ్రామిక వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ బ్యాంకు ద్వారా పింఛన్లు అందుకునే సుమారు 32వేల మంది వృద్ధులు డబ్బులు అందక ఆకలితో అల్లాడిపోతున్నారు. రాజధాని అసన్సియో వీధుల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతుండటంతో దేశంలో అల్లకల్లోల వాతావరణం నెలకొంది.
ఈ బ్యాంకు పతనం కేవలం ప్రజల పర్సనల్ అకౌంట్లకు మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని ప్రభుత్వ సంక్షేమ నిధులు, సుమారు 380 మిలియన్ డాలర్ల పెన్షన్, హెల్త్‌కేర్ ఫండ్స్ కూడా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం ప్రమాదంలో పడటంతో దేశ ఆర్థిక వ్యవస్థే అస్తవ్యస్తమైంది. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. బాధితుల ఆక్రోశం, బ్యాంకుల ముందు వారి కన్నీళ్లు అక్కడి దయనీయ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం అత్యవసరంగా నిధులు విడుదల చేసి చిన్న ఖాతాదారులకు చెల్లింపులు ప్రారంభించినప్పటికీ.. సగం జనాభా ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
ఈ భారీ కుంభకోణం కేవలం ప్రజలనే కాకుండా.. దేశ రాజకీయ రూపురేఖలను కూడా క్షణాల్లో మార్చేసింది. బ్యాంకు యజమానులకు అనుకూలంగా వ్యవహరించి, వారి వ్యాపార విస్తరణకు రాజకీయ పలుకుబడి వాడారనే ఆరోపణలతో అధ్యక్షుడు శాంటియాగో పెనాపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రజల ఆగ్రహం, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో సెనెట్ ఆయనను పదవి నుంచి దించి గృహనిర్బంధంలోకి ఉంచింది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగగా రానున్న రోజుల్లో ఈ పరిస్థితులను ఎలా సరిదిద్దుతారు.. పరిస్థితులు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారిపోయింది.
