రోజూ వెయ్యి క్యాన్సర్ కేసులు : ఇంగ్లాండ్ దేశంలో ఏం జరుగుతుంది..!

రోజూ వెయ్యి క్యాన్సర్ కేసులు : ఇంగ్లాండ్ దేశంలో ఏం జరుగుతుంది..!

ఇంగ్లాండ్‌లో క్యాన్సర్ కేసులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రోజుకు 1,000 మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తాజా NHS గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఎక్కువ మందికి వ్యాధిని గుర్తిస్తున్నప్పటికీ.. వారికి సరైన సమయంలో చికిత్స అందించడంలో మాత్రం ఆరోగ్య సేవలు వెనుకబడుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా క్యాన్సర్ గణాంకాల ప్రకారం.. 2024లో ఇంగ్లాండ్‌లో 3.73 లక్షల మందికి పైగా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. 2023లో రోజుకు సగటున 972 మందికి క్యాన్సర్ ఉన్నట్లు తేలగా, 2024లో ఈ సంఖ్య 1,021కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా నాలుగు రకాల క్యాన్సర్లు ప్రోస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు క్యాన్సర్లకి సంబంధించినవే. 

ముందుగానే గుర్తిస్తున్నా.. చికిత్సలో ఆలస్యం
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే విషయంలో కొంత అభివృద్ధి కనిపించింది. 2023లో తొలి రెండు దశల్లోనే 55.8 శాతం కేసులను గుర్తించగా, 2024లో ఈ సంఖ్య 56.7 శాతానికి పెరిగింది. అంటే గత ఏడాదితో పోలిస్తే కొంత మంచి ఫలితాలు నమోదయ్యాయి.

NHS జాతీయ క్యాన్సర్ క్లినికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీటర్ జాన్సన్ మాట్లాడుతూ.. తాజా గణాంకాలు ఆరోగ్య సేవలు సరైన దిశలో ముందుకు సాగుతున్నాయని సూచిస్తున్నాయన్నారు. క్యాన్సర్ పరీక్షలు, స్క్రీనింగ్ సేవలను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కొత్త చికిత్సా విధానాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, రోగులకు వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.  అయితే, క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సకు సంబంధించి నిర్దేశించిన గడువులను NHS ఇంకా అందుకోలేకపోతోంది.

ఆగస్టులో నమోదైన గణాంకాల ప్రకారం.. క్యాన్సర్ ఉందనే అనుమానంతో అత్యవసరంగా ఆసుపత్రులకు పంపిన వారిలో 78.6 శాతం మందికి 28 రోజుల్లోనే వ్యాధి ఉందో లేదో నిర్ధారించారు. కానీ NHS లక్ష్యం 80 శాతంగా ఉంది.

చికిత్స విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. క్యాన్సర్ అనుమానంతో అత్యవసరంగా రిఫర్ చేసిన తర్వాత లేదా నిపుణుల సూచన మేరకు 62 రోజుల్లో చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఈ గడువులో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 71.9 శాతంగానే ఉంది. NHS నిర్దేశించిన లక్ష్యం 85 శాతం.

క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణాలేంటి?
క్యాన్సర్ రీసెర్చ్ యూకే పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఇయాన్ వాకర్ మాట్లాడుతూ.. NHS సిబ్బంది ప్రతిరోజూ ఎక్కువ మందిలో క్యాన్సర్‌ను గుర్తిస్తున్నప్పటికీ, చాలామందికి వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడుతోందని అన్నారు.

ఆలస్యంగా క్యాన్సర్ గుర్తించే పరిస్థితిని తగ్గించాలని, రోగులకు సకాలంలో చికిత్స అందేలా ఆరోగ్య వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు రావాలని, NHSకు అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలు అందించాలని కోరారు.

రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ క్లినికల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హిలరీ విలియమ్స్ కూడా ఇదే విషయంపై స్పందించారు. రోజుకు 1,000 మందికి పైగా క్యాన్సర్ నిర్ధారణ అవుతుండటం NHSపై పెరుగుతున్న ఒత్తిడిని తెలియజేస్తోందన్నారు.

క్యాన్సర్ కేసులు పెరగడానికి జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం ఒక కారణమని చెప్పారు. అలాగే, ఊబకాయం కూడా క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకంగా మారుతోందని వివరించారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలను మరింత విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరోగ్య సేవల్లో అసమానతలు కూడా కారణమే!
మాక్‌మిలన్ క్యాన్సర్ సపోర్ట్ సంస్థ ప్రతినిధి స్టీవెన్ మెకింతోష్ మాట్లాడుతూ.. క్యాన్సర్ గణాంకాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించిన అసమానతలు కూడా కనిపిస్తున్నాయని అన్నారు.

ఒక వ్యక్తి నివసించే ప్రాంతం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం వంటి అంశాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. అంతేకాదు, వ్యాధి ఎంత త్వరగా గుర్తిస్తారు, చికిత్స ఎలా అందుతుంది, రోగి కోలుకునే అవకాశాలు ఎలా ఉంటాయనే విషయాల్లోనూ ఈ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

ప్రతి ఏడుగురు మహిళల్లో ఒకరికి  
బ్రెస్ట్ క్యాన్సర్ నౌ సంస్థ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రేచల్ ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్ విషయంలో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూకేలో ప్రతి ఏడుగురు మహిళల్లో ఒకరికి   రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా పని చేసే వయసులో ఉన్న మహిళల్లో కూడా ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోందని చెప్పారు.

మహిళలు  రొమ్ముల్లో ఏవైనా కొత్త మార్పులు, అసాధారణ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.  మహిళలు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆహ్వానం అందినప్పుడు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

మొత్తంగా చూస్తే.. ఇంగ్లాండ్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధిని ముందుగానే గుర్తించడంతో పాటు, రోగులకు ఆలస్యం లేకుండా చికిత్స అందించడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.