బాలీవుడ్ సెలబ్రిటీలను బెదిరించిన ఐటీ ఇంజనీర్ అరెస్ట్.. లారెన్స్ బిష్ణోయ్ పేరుతో డబ్బు డిమాండ్!

బాలీవుడ్ సెలబ్రిటీలను బెదిరించిన ఐటీ ఇంజనీర్ అరెస్ట్.. లారెన్స్ బిష్ణోయ్ పేరుతో డబ్బు డిమాండ్!

బాలీవుడ్ సెలబ్రిటీలను బెదిరిస్తూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తున్న సైబర్ నేరగాడిని పట్టుకున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల ఐటీ ఇంజనీర్ వైభవ్ మిశ్రాను బెంగళూరులో అరెస్ట్ చేసి ముంబైకి తరలించారు. ప్రముఖ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా సహా పలువురు సెలబ్రిటీలకు సోషల్ మీడియా వేదికగా బెదిరింపు మెసేజ్‌లు పంపి రూ.5 కోట్లు కట్టాలంటూ డిమాండ్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.

బెంగళూరు నుంచి అదుపులోకి తీసుకున్న నిందితుడిని నవంబర్ 6న ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు.. సేకరించిన బెదిరింపు ఆడియో రికార్డింగ్‌లు, సాంకేతిక ఆధారాలను పరిశీలించే నిమిత్తం కోర్టు అతడిని నవంబర్ 10 వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. నటుడు టైగర్ ష్రాఫ్ నివాసంపై జరిగిన కాల్పుల ఘటన తర్వాతే బాలీవుడ్ ప్రముఖులకు ఈ రకమైన బెదిరింపులను స్టార్ట్ చేశాడు.

నిందితుడు వైభవ్ మిశ్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెలబ్రిటీలను సంప్రదించి.. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తినని నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ గొంతును పోలిన వాయిస్‌తో బెదిరింపు ఆడియో మెసేజ్‌లు పంపి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇలా సాంకేతికతను, ఫేక్ ఐడీలను ఉపయోగించి సెలబ్రిటీలను భయపెట్టి అందినకాడికి వసూళ్లకు పాల్పడాలని పక్కాగా ప్లాన్ వేశాడు.

ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిందితుడి మొబైల్ ఫోన్‌ నుంచి కీలకమైన డేటాను సేకరించి విశ్లేషిస్తున్నారు. సెలబ్రిటీలను బెదిరించేందుకు అతడు ఉపయోగించిన ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టారు. వైభవ్ మిశ్రా ఈ నేరంలో ఒంటరిగా వ్యవహరించాడా లేక అతడి వెనుక ఎవరైనా ఇతర సహచరులు, పెద్ద గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

ALSO READ : అవ‌న్నీ అస‌త్యాలే.. ప్రభుత్వ ఒత్తిడి లేదు.. మాతృభూమి సినిమాపై సల్మాన్ ఖాన్ క్లారిటీ..

నిందితుడి వాయిస్ నమూనాలను సేకరించి, బెదిరింపు కాల్స్‌లోని ఆడియోతో పోల్చి నిజానిజాలను నిర్ధారించనున్నారు. అసలు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో అతనికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా.. కేవలం భయపెట్టే ఉద్దేశంతోనే గ్యాంగ్ పేరును వాడుకున్నాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.