భారత్‌లో క్రిప్టో సంస్థలపై ED దాడులు.. అనుమతులు లేకుండా విదేశీ ట్రేడింగ్ గుర్తింపు!

భారత్‌లో క్రిప్టో సంస్థలపై ED దాడులు.. అనుమతులు లేకుండా విదేశీ ట్రేడింగ్ గుర్తింపు!

దేశంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లు కాయిన్‌డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్ సంస్థలకు చెందిన బెంగళూరు ఆఫీసులపై ఈడీ అధికారులు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. FEMA రూల్స్ ఉల్లంఘించారన్న అనుమానాలతో ఈ దాడులు జరగడం క్రిప్టో వర్గాల్లో కలకలం సృష్టించింది.

ఈ సోదాల వెనుక పెద్ద కారణమే ఉంది. భారత్‌లోని క్రిప్టో ఇన్వెస్టర్ల నుంచి రూపాయిల్లో సేకరించిన నిధులను.. క్రిప్టోకరెన్సీ అయిన 'టెథర్' రూపంలోకి మార్చి వాటిని బినాన్స్, కుకాయిన్, గేట్.ఐఓ వంటి విదేశీ ఎక్స్ఛేంజ్‌లకు అక్రమంగా తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే విదేశీ కంపెనీల టోకెనైజ్డ్ స్టాక్స్ ఆపిల్, గూగుల్, టెస్లా షేర్లు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌ను ఈ ప్లాట్‌ఫారమ్‌లు నిర్వహించాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

కాయిన్‌డీసీఎక్స్ విదేశీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యేక ఖాతాలను నిర్వహిస్తూ డిజిటల్ ఆస్తులను విదేశాల్లో నిల్వ చేసిందని ఈడీ ఆరోపించింది. ఇక డెల్టా ఎక్స్ఛేంజ్ ఇండియా కూడా తన ఫ్యూచర్స్, ఆప్షన్స్ లావాదేవీలను కాయిన్‌డీసీఎక్స్ ద్వారా హైపర్‌లిక్విడ్ వంటి విదేశీ ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లించినట్లు గుర్తించారు సోదాల్లో. ఫెమా నిబంధనలే కాకుండా, సెబీ, RBI చట్టాలను కూడా ఈ సంస్థలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే ఈ పరిణామాలపై స్పందించిన కాయిన్‌డీసీఎక్స్, డెల్టా ఎక్స్ఛేంజ్ సంస్థలు తాము అధికారులకు పూర్తిగా సహకరించినట్లు స్పష్టం చేశాయి. తమ కార్యకలాపాలు ఎప్పుడూ సాధారణంగానే సాగుతున్నాయని.. యూజర్ల ఫండ్స్ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని భరోసా కల్పించాయి. తాము FIU-IND నిబంధనలతో పాటు దేశంలోని అన్ని చట్టాలకు లోబడి పారదర్శకంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని ప్రకటించాయి.

ALSO READ : దీపావళికి ముందు పెరిగిన గోల్డ్.. శనివారం హైదరాబాద్ రేట్లివే

తాజా ఈడీ సోదాలు దేశంలోని క్రిప్టోకరెన్సీ మార్కెట్‌పై ప్రభుత్వ నిఘా ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. అనుమతులు లేని విదేశీ మార్గాల ద్వారా నిధులు మళ్లించడం, చట్టపరమైన నిబంధనలను అతిక్రమించడం ఎంతటి వారికైనా ప్రమాదకరమని ఈడీ చర్యలు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లపై మరింత కఠినమైన నిబంధనలు అమలయ్యే అవకాశం ఉందని తాజా పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.