అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకలకు పలువురు భారతీయ ప్రముఖులు హాజరయ్యారు. భారతీయ పారిశ్రామికవేత్త విశాల్ గోండల్, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, కెనడా మాజీ ఎంపీ రూబీ ధల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెల్త్ టెక్నాలజీ కంపెనీ GOQii వ్యవస్థాపకుడు విశాల్ గోండల్.. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌ను కలిశారు. ఆయనతో కలిసి సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించారు. తరువాత ట్రంప్‌కు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని విశాల్ గోండల్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ట్రంప్‌తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. హనుమాన్ చాలీసాని అమెరికా అధ్యక్షుడికి బహూకరించడం గర్వంగా ఉందన్నారు.
హనుమాన్ చాలీసాను తులసీదాస్ రచించారని, ధైర్యం, భక్తి, బలం కోసం ఎంతోమంది దీనిని పఠిస్తారని గోండల్ తన పోస్టులో పేర్కొన్నారు.
భారత్-అమెరికా స్నేహం మరింత బలపడాలని ప్రార్థన
వైట్‌హౌస్‌లో దీపాలు వెలిగించే సమయంలో భారత్, అమెరికా మధ్య స్నేహబంధం మరింత బలపడాలని ప్రార్థించినట్లు విశాల్ గోండల్ తెలిపారు. చీకటిపై వెలుగు విజయం సాధించాలని ఆకాంక్షించినట్లు చెప్పారు.
అంతేకాకుండా 'జుగ్ జుగ్ జియో' అనే భారతీయ సంప్రదాయ ఆశీర్వాదాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీని అర్థం 'మీరు యుగయుగాల పాటు జీవించాలి' అని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ శాంతి, సంతోషం, మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే?
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించే సంప్రదాయం 2003లో ప్రారంభమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మొదట్లో ఈ వేడుకలు ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో నిర్వహించేవారు. వీటికి భారతీయ-అమెరికన్లు, భారత దౌత్యవేత్తలు హాజరయ్యేవారు.
2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో దీపాలు వెలిగించారు. ఇలా వైట్‌హౌస్‌లో అధికారికంగా దీపాలు వెలిగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. అప్పటి నుంచి వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్, రూజ్‌వెల్ట్ రూమ్ వంటి వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నారు. అప్పటినుంచి ఈ వేడుకలు భారతీయ-అమెరికన్ సమాజానికి ప్రత్యేక గుర్తింపుగా కొనసాగుతున్నాయి.
