ఇండియాలో ఎమర్జెన్సీ విధించి దాదాపు 50 ఏండ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ అప్పటి పరిస్థితులను గురించి రాజకీయంగా చర్చ నడుస్తుంటుంది. కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు ఇతర రాజకీయ పార్టీలు ఎమర్జెన్సీ ఆయుధంగా వాడుతుంటారు. ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు ఎమర్జెన్సీ ఇటీవలే జరిగింది అన్నట్లుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎమర్జెన్సీపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ పొరపాటేనని పేర్కొనడం చర్చనీయంశంగా మారింది.
సోనియా గాంధీ తన మెమాయిర్ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ రిలీజ్ కు ముందు.. ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. ఎమర్జెన్సీ పొరపాటే కానీ.. దానికి కారణం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ అని అన్నారు.
ఎమర్జెన్సీ విధించడం తమ కుటుంబంలోనూ విభేదాలకు దారితీసిందని సోనియా చెప్పారు. ఇందిరా గాంధీ మొదటి నుంచీ ప్రజాస్వామ్యవాది అని, ఎమర్జెన్సీపై ఆమె ఎప్పుడూ సౌకర్యంగా లేరని ఆమె అన్నారు. ఎమర్జెన్సీ ఆమెపై భారంగా ఉండేదని అన్నారు.
ఎమర్జెన్సీ విధించే ముందు రాజీవ్ గాంధీ తల్లిని వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండమని సలహా ఇచ్చారు. కానీ సంజయ్ ఎమర్జెన్సీ పెట్టాల్సిందేనని ఒత్తిడి చేశారు. సంజయ్‌కు క్యాబినెట్ లేదా ప్రభుత్వ పదవి లేకపోయినా, ఇందిరాపై అసాధారణ ప్రభావం ఉండేది. ఆయనను దేశంలో రెండో శక్తివంతుడిగా చూసేవారు అని అన్నారు.
కుటుంబ విందులో సంజయ్ దీనిపై తీవ్ర చర్చ జరిగినట్లు చెప్పారు. 1975లో అలహాబాద్ కోర్టు తీర్పు తర్వాత.. దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో.. ఎన్నికల వరకు వేచి చూడాలని రాజీవ్ చెప్పగా.. ప్రతిపక్షాన్ని ఆపాలంటే ఎమర్జెన్సీ పెట్టాల్సిందేనని సంజయ్ ఒత్తిడి చేసినట్లు చెప్పారు.
సీనియర్ నాయకుల ఒత్తిడి కూడా
సంజయ్‌తో పాటు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇందిరాపై ఒత్తిడి తెచ్చారని ది హిందూతో మరో ఇంటర్వ్యూలో సోనియా చెప్పారు. ఆమె సీనియర్ సహచరుల నుంచి చాలా ఒత్తిడి ఉండేది... రాజీవ్ లాంటి కొద్దిమంది మాత్రమే వేరే అభిప్రాయం కలిగి ఉన్నారు అని అన్నారు.
సోనియా గాంధీ మెమాయిర్ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ 2026 నవంబర్ 10న విడుదల కానుంది. ఇందులో ఆమె ఇటలీలోని తన తొలి నాళ్ల నుంచి రాజీవ్ గాంధీతో వివాహం తర్వాత రాజకీయ ప్రయాణం గురించి రాశారు. నాలుగైదు దశాబ్దాల భారత రాజకీయలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సోనియా గాంధీ తీసుకుస్తున్న పుస్తకంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
