దమ్ముంటే నాపై బుల్డోజర్ నడపండి..బీజేపీకి మమతా బెనర్జీ సవాల్..

దమ్ముంటే నాపై బుల్డోజర్ నడపండి..బీజేపీకి మమతా బెనర్జీ సవాల్..

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తన మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై దాడి, కాళీఘాట్‌లోని తన ఇంటి వద్ద కాళీ పూజ వేడుకలకు ఆటంకాలు కలిగించడంపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీకి దమ్ముంటే తనపై బుల్డోజర్ నడపాలని సవాల్ విసిరారు.

అభిషేక్ బెనర్జీని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ.. "మీ దగ్గర ఎన్ని బుల్డోజర్లు ఉన్నాయి? రండి.. నేను మీ ముందే నిలబడి ఉన్నాను. నా శరీరంపై, నా ఛాతీపై బుల్డోజర్‌ను నడపండి. మీరెంత ధైర్యవంతులో చూడాలనుకుంటున్నా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.కాళీఘాట్‌లో సంప్రదాయంగా నిర్వహించే కాళీ పూజ వేడుకలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మమతా ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న కొన్ని పూజలకు అనుమతులు రద్దు చేశారని, అదే సమయంలో ప్రధాన రహదారిపై కొత్తగా పూజ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారని విమర్శించారు. స్థానిక క్లబ్‌లు తమ సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని, బీజేపీ గూండాయిజంతో ఆ ప్రాంతంలో అశాంతి సృష్టిస్తోందని ఆరోపించారు.

సంప్రదాయంగా ఒక నిర్దిష్ట ప్రాంగణంలో నిర్వహించే పూజను ప్రధాన రహదారిపై కొత్తగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ మార్పుల కారణంగా తన నివాసంలో కాళీ పూజ వేడుకలు నిర్వహించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు, తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి తన కోల్‌కతా నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటన వెనుక అధికార బీజేపీ ఉందని విమర్శించారు.డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అయిన అభిషేక్.. గత ఆరు నెలల్లో తనపై ఇది ఏడో హత్యాయత్నమని ఆరోపించారు. శనివారం ఉదయం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పలు వీడియోలను షేర్ చేస్తూ, తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు తన కాళీఘాట్ నివాసంపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు, పరిపాలనా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. న్యాయవ్యవస్థ సైతం ఈ పరిణామాలను చూస్తూ మూగ ప్రేక్షకురాలిగా మిగిలిపోయిందని ఆరోపించారు.ఈ ఘటనలతో కాళీఘాట్ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ స్పందన, ఘటనకు సంబంధించి అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.