ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో వర్క్ ఫ్రమ్ పార్క్

ఐటీ ఉద్యోగులకు  గుడ్ న్యూస్..త్వరలో వర్క్ ఫ్రమ్ పార్క్

హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ శ్రీజన వెల్లడించారు. మరో మూడు నెలల్లో కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 300 పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే 'వర్క్ ఫ్రమ్ పార్క్' కాన్సెప్ట్ ఆధారంగా పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగులు పార్కులకు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో పని చేసుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌ను చిల్డ్రన్ ఫ్రెండ్లీ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

కొబ్బరి బొండాల వ్యర్థాలను ప్రాసెస్ చేసి, వాటి నుంచి వచ్చే పదార్థాలను రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. హోమ్ కంపోస్టింగ్‌తో పాటు కమ్యూనిటీ కంపోస్టింగ్ కేంద్రాలను పెంచుతామన్నారు. గ్రీన్ వేస్ట్‌ను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసేందుకు ప్రతి వార్డులో ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.చికెన్ వ్యర్థాలను ఫిష్ ఫీడింగ్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించామని, అనధికారికంగా కొనసాగుతున్న చికెన్ వేస్ట్ నిర్వహణ వ్యవస్థను అరికడతామని స్పష్టం చేశారు.

అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని శ్రీజన తెలిపారు. అక్రమ భవనాల తొలగింపు విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. అయితే అక్రమ నిర్మాణాల తొలగింపు సమయంలో కోర్టు కేసులు, ఇతర న్యాయపరమైన ప్రక్రియల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.

సైబరాబాద్ పరిధిలో వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. భారీ వర్షాలు కురిసినా రోడ్లపై అరికాళ్ల వరకు కూడా నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.సైబరాబాద్ పరిధిలో ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ అవసరాల కోసం ప్రతిరోజూ 1.60 లక్షల లీటర్ల గ్రీన్ వాటర్ వినియోగిస్తున్నట్లు శ్రీజన తెలిపారు. పార్కుల్లో ఉన్న బోర్ల వినియోగాన్ని నిలిపివేసి, పార్కుల అవసరాలకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగిస్తున్నామని చెప్పారు.భవన నిర్మాణాల కోసం కూడా శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సూచిస్తూ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

337 ప్రైవేట్ ఎస్టీపీలకు నోటీసులు

గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాల్లో నిర్వహిస్తున్న 337 ప్రైవేట్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (STP)కు నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి ఎస్టీపీ తప్పనిసరిగా పనిచేయాల్సిందేనని, నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పార్కుల అభివృద్ధి, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సైబరాబాద్‌ను మరింత పచ్చదనంతో, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ శ్రీజన స్పష్టం చేశారు.