సిటీల్లో ఫుట్ పాత్ లేకపోవడం, ఉన్నా అవి ఆక్రమణలకు గురికావడం మూలంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాల రద్దీతో సతమతం అవుతున్న నగర జీవికి.. ప్రశాతంగా రోడ్డెంబడి నడుచుకుంటూ వెళ్లే అవకాశం ఉండదు. మరోవైపు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఎందరో పాదచారులు గాయాలపాలవ్వడం, ప్రాణాలు కోల్పోవడం లెక్కలేనని ఘటనలు ఉన్నాయి. కేరళలో కూడా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా లక్షల్లో సంపాదిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలైపోయింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహానికి గురికావడంతో.. హైకోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
కక్కనాడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో పాదచారుల భద్రత ఎక్కడ అనే ప్రశ్నలేవనెత్తింది. 2026 నవంబర్ 5న బుధవారం ఉదయం సుమారు 8:20 గంటలకు ఇన్ఫోపార్క్‌లోని ఈవై (EY) సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల అక్షర యాక్సిడెంట్ కారణంగా చనిపోయింది. జిమ్ నుంచి ఇంటికి నడుస్తూ ఉండగా, ఓవర్ స్పీడుతో వచ్చిన ప్రైవేట్ బస్సు ఆమెను ఢీకొని, పైనుంచి దూసుకుపోయింది. ఆమెను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, లాభం లేకుండా పోయింది. అక్షర చనిపోవడంతో ఇన్ఫోపార్క్ పోలీసులు బస్సు డ్రైవర్ బినాయ్ను హత్యకు సమానమైన నేరం కింద అరెస్టు చేశారు.
టెక్ ఉద్యోగుల ఆగ్రహం
ఈ ఘటనతో ఇన్ఫోపార్క్ ఐటీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం (నవంబర్ 5) సాయంత్రం క్యాండిల్ లైట్ విజిల్ నిర్వహించారు. ప్రోగ్రెసివ్ టెకీస్, ప్రతిధ్వని వంటి ఉద్యోగుల సంఘాలు సురక్షిత రోడ్ల కోసం ప్రచారం ప్రారంభించాయి. ఇరుకైన రోడ్లు, అధిక ట్రాఫిక్, ప్రైవేట్ బస్సుల అధిక వేగం వల్ల రోజువారీ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఎత్తి చూపుతున్నారు. దీనికి తోడు ఫుట్‌పాత్‌లు లేకపోవడంతో పాదచారులు నేరుగా రోడ్డుపై నడవాల్సి వస్తోందని.. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రోగ్రెసివ్ టెకీస్ డిజిటల్ సంతకాల పిటిషన్ ప్రారంభించగా, వేలాది మంది సంతకాలు చేశారు. ఐఎంజి జంక్షన్ నుంచి ఇన్ఫోపార్క్ వరకు రోడ్డు విస్తరణ, ఫుట్‌పాత్‌లు, రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. కేరళ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రతిధ్వని సంఘం ప్రకటించింది.
రంగంలోకి హైకోర్టు
ఈ విషాదాన్ని పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు శుక్రవారం (నవంబర్ 06) రెక్లెస్ డ్రైవింగ్, భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యాక్సిడెంట్ ఫుటేజ్ చూసిన జస్టిస్ దేవన్ రామచంద్రన్, ఫుట్‌పాత్ లేకపోవడంతో బాధితురాలు రోడ్డు అంచున నడవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అధికారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమణలు, పార్క్ చేసిన వాహనాల నుంచి క్లియర్ చేయకపోవడాన్ని తప్పుబట్టారు.
కొచ్చి పోలీసులు ప్రైవేట్ బస్సు డ్రైవర్లను ట్రాక్ చేయడానికి క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ ఐడి వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. కోర్టు ఒక వారంలోపు అన్ని ప్రైవేట్ బస్సు డ్రైవర్లను ఈ వ్యవస్థలోకి తీసుకురావాలని ఆదేశించింది. అలాగే, ట్రాఫిక్ ఐ హెల్ప్‌లైన్ నంబర్ 6238100100ను అన్ని ప్రైవేట్ బస్సులపై స్పష్టంగా ప్రదర్శించాలని కూడా ఆదేశించింది. నవంబర్ 13 కు వాయిదా వేశారు.
