రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ ? బీజేపీ మద్దతుపై వస్తున్న వార్తలకు హీరో సమాధానం ఇదే!

రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ ? బీజేపీ మద్దతుపై వస్తున్న వార్తలకు హీరో సమాధానం ఇదే!

తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ  ప్రవేశానికి బీజేపీ మద్దతు ఉందంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ధనుష్ స్పందించారు. తనకు ఏ రాజకీయ పార్టీ అండదండలు లేవంటూ... దేవుడు, అభిమానులు, ప్రజలే తనకు బలమని స్పష్టం చేశారు.

తన కొత్త సినిమా 'ఓం' ఆడియో విడుదల కార్యక్రమంలో ధనుష్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రవేశం గురించి వస్తున్న ఊహాగానాలపై మాట్లాడుతూ.. తన వెనుక ఫలానా వ్యక్తులు ఉన్నారని, ఫలానా పార్టీ మద్దతు ఇస్తోందని అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు.

అయితే, వాటిలో నిజం లేదని.. ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. "నా గురించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది నా వెనుక ఉన్నారని, మరికొందరు నాకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ నన్ను నడిపించేది దేవుడు. నా వెనుక నా అభిమానులు ఉన్నారు. ప్రజలు నా వైపు ఉన్నారు. వీరే నాకు నిజమైన బలం" అని ధనుష్ పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి ధనుష్ వస్తారా?
ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే చర్చ తమిళనాడులో కొంతకాలంగా సాగుతోంది. ఆయన అభిమాన సంఘాలకు సంబంధించిన కొన్ని పరిణామాలు కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో ధనుష్ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? సొంతంగా రాజకీయ పార్టీ పెడతారా? లేక ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తారా? అనే చర్చలు మొదలయ్యాయి.

ముఖ్యంగా బీజేపీ మద్దతుతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ధనుష్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అయితే, తన రాజకీయ భవిష్యత్తుపై ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. బీజేపీతో తనకు రాజకీయ సంబంధం ఉందని కూడా ఆయన చెప్పలేదు. ప్రస్తుతం దేవుడు, అభిమానులు, ప్రజలే నాకు అండగా ఉన్నారని చెప్పడం ద్వారా తనపై వస్తున్న రాజకీయ మద్దతు ఊహాగానాలకు ఆయన స్పందించారు.

దీంతో ధనుష్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా ? వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.