బీజేపీ, RSS, మోడీ నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు: కొత్త బుక్ రిలీజ్ వేళ సోనియా హాట్ కామెంట్స్

బీజేపీ, RSS, మోడీ నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది ఏమీ లేదు: కొత్త బుక్ రిలీజ్ వేళ సోనియా హాట్ కామెంట్స్

న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత 12 ఏళ్ల మోడీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్యానికి, వ్యవస్థలకు, దేశ సామాజిక సమగ్రతకు తీవ్ర నష్టం వాటిల్లిందని విమర్శించారు. బీజేపీ దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది ఏమి లేదని పేర్కొన్నారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో సోనియా గాంధీ తన ఆత్మకథ రాసిన విషయం తెలిసిందే. 2026, నవంబర్ 10న ఈ బుక్ రిలీజ్ కానుంది. తన పుస్తకావిష్కరణకు ముందు ది హిందూకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోనియా పలు అంశాలపై మాట్లాడారు.

కాంగ్రెస్ నేర్చుకోవాల్సిందేమి లేదు

 గత 12 ఏళ్ల పాలనలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని సోనియా గాంధీ విమర్శించారు. మోడీ సర్కార్ చేసిన విధ్వంసం వల్ల ఈ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా దెబ్బతిన్న దేశ వ్యవస్థలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని రాజకీయ పార్టీలు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. 

►ALSO READ | E20 కాస్తా 420గా మారింది: E20 పెట్రోల్ కల్తీపై రాహుల్ సంచలన ట్వీట్

మోడీ సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో కాంగ్రెస్‎తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు లేవన్నారు. పార్టీ ఫిరాయింపులు, అక్రమ కేసులు, ఇతర మార్గాల ద్వారా ప్రతిపక్షాలను లొంగదీసుకునేందుకు బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

బీజేపీ, ఈసీ కుమ్మక్కై చేస్తోన్న అవినీతి, అక్రమాలను దేశ ప్రజలు గుర్తిస్తున్నారని.. దేశ ఓటర్లు మళ్లీ సరైన పరిపాలనను స్వాగతిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ప్రధాని మోడీ చాలా భిన్నమైన సిద్ధాంతాల ప్రపంచం నుండి వచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే వంటి ఎందరో నేతలు తమదైన శైలిలో రాజకీయాల్లో విజయం సాధించారని కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, ప్రధాని మోడీ నుంచి కాంగ్రెస్‎ నేర్చుకోవాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు.