లేఆఫ్స్‌లోనూ మానవత్వం.. కాన్వా అందిస్తున్న భారీ ఎగ్జిట్ ప్యాకేజీపై ఉద్యోగుల ప్రశంసలు

లేఆఫ్స్‌లోనూ మానవత్వం.. కాన్వా అందిస్తున్న భారీ ఎగ్జిట్ ప్యాకేజీపై ఉద్యోగుల ప్రశంసలు

లేఆఫ్స్ అంటే ఇలా ఉండాలిరా అనిపిస్తోంది ప్రముఖ డిజైన్ కంపెనీ కాన్వా చేసిన పని చూస్తుంటే. అవును సాధారణంగా లేఆఫ్స్ అంటేనే కంపెనీలపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తుంటాయి. కానీ ఆస్ట్రేలియన్ డిజైన్ దిగ్గజం 'కాన్వా' తీసుకున్న ఒక నిర్ణయం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. తమ సంస్థ చరిత్రలోనే అత్యంత కష్టమైన నిర్ణయంగా భావిస్తూ.. కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 22 శాతం మందిని, అంటే దాదాపు 1,271 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉద్యోగులను సాగనంపే తీరులో ఆ సంస్థ చూపించిన మానవతా దృక్పథం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఉద్యోగం కోల్పోయినప్పటికీ.. ఆ సంస్థ అందించిన ప్యాకేజీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఉద్యోగులకు కనీసం 6 నెలల జీతం, అర్హత ఉన్న దేశాల్లో 12 నెలల పాటు హెల్త్‌కేర్ కవరేజ్, కెరీర్ కోచింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సాయం, ఏడాది పాటు లింక్డ్‌ఇన్ ప్రీమియం సబ్స్క్రిప్షన్‌ను కాన్వా ఆఫర్ చేసింది. అంతేకాకుండా ఉద్యోగులు తాము వాడిన మాక్‌బుక్‌లను తమ వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది. ఇవే కాకుండా కొత్త వ్యాపారాలు, కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే మాజీ ఉద్యోగుల కోసం 'కాన్వా కలెక్టివ్ ఫండ్' ద్వారా ఎటువంటి ఈక్విటీని ఆశించకుండా 10వేల డాలర్ల గ్రాంట్‌లను ప్రకటించింది. జాబ్ కోల్పోయిన ఉద్యోగులు వ్యాపారవేత్తలుగా మారేందుకు అండగా నిలుస్తోంది. 

కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో సానుకూల స్పందన లభిస్తోంది. 2023లో కాన్వాలో చేరి, ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన ఒక మహిళ మెటర్నిటీ లీవ్ సమయంలో కంపెనీ తనకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. లేఆఫ్ చేసినప్పటికీ కంపెనీ తమను గౌరవించిన తీరు అద్భుతమని కొనియాడారు. కేవలం కాన్వానే కాకుండా.. టెక్ రంగంలో ఇటువంటి లేఆఫ్స్‌లో మెటా, డ్రాప్‌బాక్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా కొంతమేర పరిహారాలు ఇచ్చినా, కాన్వా ప్యాకేజీ మాత్రం ఆర్థిక భద్రతతో పాటు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఉండటంతో ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సంక్షోభ సమయంలో సీఈఓ మెలనీ పెర్కిన్స్ అనుసరించిన తీరు నాయకత్వ శైలిపై ప్రశంసలు వినిపిస్తున్నాయి. కష్టకాలంలోనూ ఉద్యోగుల పట్ల సానుభూతిని ప్రదర్శించడం నాయకత్వంలో కీలకమని నిరూపించింది.  

ALSO READ : E20 కాస్తా 420గా మారింది: E20 పెట్రోల్ కల్తీపై రాహుల్ సంచలన ట్వీట్

ఉద్యోగం కోల్పోవడం వల్ల కలిగే అనిశ్చితిని కేవలం పరిహారంగా ఇచ్చే డబ్బులు పూర్తిగా తొలగించలేవు. కానీ లేఆఫ్స్ తప్పనప్పుడు కంపెనీలు తమ ఉద్యోగులతో ఎలా వ్యవహరిస్తాయనేది పూర్తిగా యాజమాన్యం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులను సాగనంపడంలో కాన్వా అనుసరించిన ఈ మానవీయ కోణం టెక్ పరిశ్రమకు ఒక సరికొత్త మార్గదర్శకంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.