ఈ ఏడాది ధనత్రయోదశి రోజున దేశవ్యాప్తంగా బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగాయి. ఇటీవలి కాలంలో గోల్డ్ రేట్లు కొద్దిగా తగ్గడం వినియోగదారులకు కొనుగోలు చేసేందుకు మంచి అవకాశాన్ని కల్పించింది. దీంతో ఈ ఏడాది ధనత్రయోదశి రోజున దేశంలో మొత్తం బంగారు వ్యాపారం విలువ పరంగా 15 నుంచి 20 శాతం పెరిగి సుమారు రూ. 60వేల కోట్లకు చేరుకుంటుందని అఖిల భారత జెమ్స్ అండ్ జ్యువెలర్స్ దేశీయ కౌన్సిల్ అంచనా వేసింది.
గత జనవరి 29న రికార్డు స్థాయికి చేరిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. లక్షా 46వేల 300కి పరిమితమైంది. అయినప్పటికీ గత ఏడాది ధనత్రయోదశితో పోలిస్తే ప్రస్తుత ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే.. జనవరిలోని గరిష్ట ధరల నుంచి దాదాపు 52 శాతం తగ్గి రూ.లక్షా 92వేల 500 వద్ద ఉంది. రేట్ల పతనంతో కొనుగోలుదారులు షాపింగ్ షురూ చేశారు.
పెరిగిన ధరల నేపథ్యంలో వినియోగదారులు తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా భారీ ఆభరణాలకు బదులుగా లైట్ వెయిట్ జ్యువెలరీ, 18 క్యారెట్ల నగల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. చిన్న సైజు కాయిన్లు, బార్లు, పెండెంట్స్, గాజులు, గొలుసులకు డిమాండ్ భారీగా పెరిగింది. జైపూర్, సూరత్, డెహ్రాడూన్, రాయ్‌పూర్ వంటి చిన్న నగరాల్లోనూ ఫస్ట్-టైమ్ బైయర్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించిందని వ్యాపారులు వెల్లడించారు. పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే ట్రెండ్ ఈసారికూడా వ్యాపారాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్ రూపంలోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి.
►ALSO READ | దీపావళికి ముందు పెరిగిన గోల్డ్.. శనివారం హైదరాబాద్ రేట్లివే
దేశంలోని ప్రముఖ జ్యువెలరీ సంస్థలన్నీ భారీ వృద్ధిని నమోదు చేశాయి. కల్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, పీఎన్జీ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్ వంటి దిగ్గజ సంస్థలు తమ అమ్మకాలు 25% నుంచి 50% వరకు పెరిగినట్లు వెల్లడించాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలా మంది ముందుగానే షాపింగ్ పూర్తి చేసుకున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జరిగిన బంగారం, వెండి సేల్స్ విలువ రూ.66వేల కోట్లను దాటగా, ఒక్క ఢిల్లీ బులియన్ మార్కెట్లోనే రూ.10వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుడిగా ఉన్న భారత్‌లో ఈ పండుగ వ్యాపారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అమ్మకాల జోరుతో.
