Sandpapergate Bombshell: క్రికెట్ ప్రపంచాన్ని గజగజ వణికించిన ఆస్ట్రేలియా ‘సాండ్‌పేపర్ గేట్’ (బాల్ టాంపరింగ్) తీవ్ర వివాదంలో ఎనిమిదేళ్ల తర్వాత అసలు నిజం బయటపడింది. ఆ నాడు సాండ్ పేపర్ తో బంతిని పాడుచేసే కుట్ర చేసింది కేవలం ముగ్గురే కాదని, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఈ విషయం ముందే తెలుసని ఆసీస్ మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా బాంబు పేల్చాడు. తన ఆత్మకథ 'సబర్' (Sabar) మంగళవారం విడుదలైన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముసుగును తొలగించాడు.
అసలేం జరిగింది? (2018 కేప్‌టౌన్ డ్రామా):
* 2018 సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్ టెస్టులో ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (Cameron Bancroft) జేబులో సాండ్ పేపర్ పెట్టుకుని బంతిని రుద్దుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు.
* బోర్డు వేటు: అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కుట్రలో భాగమని తేలడంతో ఇద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించారు. బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల బ్యాన్ పడింది. వార్నర్‌పై జీవితకాలం కెప్టెన్సీ చేపట్టకుండా నిషేధించారు.
అందరికీ తెలుసు బ్రో.. నన్ను విచారించలేదు: ఖవాజా
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా మాట్లాడిన మాటలు క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇందులో బాల్ టాంపరింగ్ కుట్రతో జట్టులోని ప్రతీ ఒక్కరికీ సంబంధం ఉంది.. అక్కడ బ్యాటర్లు, బౌలర్లు, హెడ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్ అనే తేడా లేదు.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ టాంపరింగ్ ప్లాన్ ముందే తెలుసు.. ఈ విషయాన్ని వార్నర్ ఓపెన్‌గా బయటపెడతాడని అనుకున్నా.. ఈ ఇలాంటి పనికి జట్టు మొత్తం నైతిక బాధ్యత వహించాలని నేను మొదటి నుంచి మొత్తుకున్నాను అని ఖావాజా వెల్లడించాడు.
నిజం చెప్తానని నన్ను పక్కనపెట్టేశారు:
ఆ మ్యాచ్ సమయంలో తాను డగౌట్‌లో బాన్‌క్రాఫ్ట్ పక్కనే కూర్చున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) విచారణ తీరును ఎండగట్టాడు. నేను విచారణకు వెళ్తే నిజాలన్నీ బయటకు చెబుతానని, దీని వలన టీమ్ మొత్తం ఇబ్బందుల్లో పడుతుందనే విషయం బోర్డుకు ముందే తెలుసు.. అందుకే నన్ను అసలు విచారణకే పిలవకుండా పక్కన పెట్టేశారని ఉస్మాన్ ఖావాజా ఆరోపించాడు.
ఉస్మాన్ ఖావాజా టెస్ట్ రికార్డులు (At a Glance):
ఈ ఏడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఖావాజా ఆస్ట్రేలియాకు తిరుగులేని సేవలు అందించాడు.
* టెస్టులు: 88 మ్యాచులు | పరుగులు: 6,229 | సెంచరీలు: 16
* వన్డేలు & టీ20లు: 40 వన్డేలు, 9 T20Is
