బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కింగ్' విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట 'తూ మిల్ జాయే' ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన కాషాయ రంగు దుస్తులు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రవీ నేగి డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.
ఢిల్లీలోని పట్పర్గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీ నేగి.. ఈ పాటపై దేశవ్యాప్త బహిష్కరణకు పిలుపునిచ్చారు. దీపిక ధరించిన కాషాయ దుస్తుల్లోని సన్నివేశాన్ని తొలగించకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. షారుఖ్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వివాదాన్ని మరింత రాజేశారు. దీపికను కేవలం ఓ పావుగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ సన్నివేశం మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో షారుఖ్ నటించిన 'పఠాన్' సినిమా సమయంలోనూ దీపిక ధరించిన కాషాయ బికినీపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో 'కింగ్' పాట చుట్టూ వివాదం ముదురుతోంది. అయితే ఈ ఆరోపణలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ పాటకు ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్ తొలిసారి బాలీవుడ్ పాటలో భాగమయ్యారు. అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చీతో కలిసి ఆయన ఆలపించిన ఈ పాటకు సచిన్-జిగర్ సంగీతం అందించారు. షారుఖ్ 61వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ పాట విడుదలైంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కింగ్'లో షారుఖ్, దీపికతో పాటు సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. మరి ఈ వివాదం సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి..
