ఇండియన్ సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కిని 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కును దాటేసింది.
రెండో రోజు కలెక్షన్లలో తగ్గుదల..
నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వసూళ్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తొలి రోజు ఇండియాలో రూ.64.85 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అయితే శుక్రవారం వర్కింగ్ డే కావడంతో రెండో రోజు కలెక్షన్లలో 25.9 శాతం తగ్గుదల నమోదైంది. ఆ రోజు రూ.48.05 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లో భారతదేశంలో నెట్ కలెక్షన్లు రూ.112.90 కోట్లకు చేరగా, గ్రాస్ వసూళ్లు రూ.134.80 కోట్లుగా నమోదయ్యాయి.
ఓవర్సీస్ మార్కెట్లోనూ రామాయణ ప్రభంజనం కొనసాగుతోంది. రెండో రోజు విదేశాల్లో రూ.35 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లోనే అక్కడ రూ.86.25 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.221.05 కోట్లకు చేరుకుంది. కన్నడ వెర్షన్‌కు థియేటర్లలో అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది.
హిందీ హవా..
ఇక రెండో రోజు హిందీ వెర్షన్ రూ.35.50 కోట్లు కొల్లగొట్టి అగ్రస్థానంలో నిలిచింది. కన్నడలో రూ.5.15 కోట్లు, తెలుగులో రూ.4.75 కోట్లు, తమిళంలో రూ.1.50 కోట్లు, మలయాళంలో రూ.1.15 కోట్లు వసూలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 23,316 షోల ద్వారా ఈ వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల్లో 43 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ రెండు రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్లలో రూ.215.78 కోట్లతో ఉన్న 'ఆదిపురుష్' రికార్డును రామాయణ అధిగమించింది.
►ALSO READ | మహాకాళి మూవీ నుంచి అయిగిరి నందిని సాంగ్ రిలీజ్..
అసలు పరీక్ష ఇప్పుడే..
నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ రెండు భాగాల చిత్రానికి కలిపి సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నట్లు సమాచారం. మొదటి భాగం సీతాపహరణం, జటాయువు మరణంతో ముగిసి, రాముడి ప్రతిజ్ఞతో రెండో భాగంపై ఆసక్తిని పెంచింది. శనివారం, ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగితే ఈ సినిమా మరో భారీ మైలురాయిని చేరే అవకాశం ఉంది. అయితే ఈ ఫస్ట్ వీక్ రూ.500 కోట్ల మార్కును అందుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..
