తమిళనాడులో ఓ లైబ్రరీ వివాదం తమిళనాట రాజకీయాలను కుదిపేస్తోంది. తమిళహేతువాది పెరియార్ పేరున నిర్మించిన లైబ్రరీలో ఫేక్ పబ్లిషర్స్, ఫేక్ రైటర్స్ పేరుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో నకిలీ పుస్తకాలను ప్రచురించి కొనుగోలు చేశారని ఆరోపణలు అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ సాగుతోంది. కోయంబత్తూర్లో దాదాపు 300 కోట్లతో నిర్మించిన ‘‘పెరియార్ అరివుగలం లైబ్రరీ’’లో భారీ కుంభకోణం జరిగిందని, మీ హయాంలో జరిగిందంటే.. మీ హయాం లోనే జరిగిందంటూ అటు ప్రతిపక్షం డీఎంకే, అధికార పార్టీ టీవీకేలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందో వివరంగా..
ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్మించిన ‘‘పెరియార్ అరివులగం ’’గ్రంథాలయం వివాదానికి కేంద్రంగా మారింది. లైబ్రరీలో ఫేక్ పబ్లిషర్స్, ఫేక్ రైటర్స్పేర్లతో ఉన్న వేలాది పుస్తకాలు కొనుగోలు చేశారనే ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా చారిత్రక పుస్తకాల్లో తప్పులు, వ్యాకరణ దోషాలు ఉండటంతో పాటు, కొన్ని రచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించినట్లు ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ఆరోపించారు.
మురుగన్ వివరాల ప్రకారం.. అగల్ విళక్కు అనే పబ్లిషింగ్ సంస్థకు చెందిన దాదాపు 1800 పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి. ఫీనిక్స్ పబ్లికేషన్స్ నుంచి మరో వంద పుస్తకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని పుస్తకాల ధర రూ.1,400కు పైగా ఉండటం, రచయితల పేర్లు అనుమానాస్పదంగా ఉండటం వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. తమిళ సాహిత్యం, చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో తీవ్రమైన వాస్తవ దోషాలు , వ్యాకరణ దోషాలు ఉన్నాయని మురుగన్ ప్రూఫ్ లతో వివరించారు. 1947లో తమిళనాడు తొలి సీఎం పేరును తప్పుడు పేరుగా రాయడం, ప్రముఖ సాహిత్య రచనలకు రచయితల పేర్లు తప్పుగా ఉండటం వంటి విషయాలను మురుగన్ బయటపెట్టారు.
వివాదం వెనక ..
గత డీఎంకే ప్రభుత్వ హయాంలో పెరియార్ అరివులగం గ్రంథాలయ నిర్మాణం ప్రారంభమై, ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో పూర్తయింది. రూ. 300 కోట్లతో ఈ లైబ్రరీని నిర్మించారు. 2026 అక్టోబర్ 16న సీఎం విజయ్ ప్రారంభించారు. మురుగన్ ఆరోపణలతో ఈ లైబ్రరీపై రాజకీయ రగడ మొదలైంది. తాజాగా ఈ వ్యవహారంపై సీఎం విజయ్ డీఎంకేపై తీవ్రవిమర్శలు చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ లైబ్రరీ నిర్మాణం ప్రారంభమైంది. ఏం జరిగినా బాధ్యత డీఎంకే ప్రభుత్వానిదే అని విజయ్స్పష్టం చేశారు. అయితే లైబ్రరీకి పుస్తకాల కొనుగోళ్లు తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని డీఎంకే విజయ్ వ్యాఖ్యలను తోసిపుచ్చింది.
ALSO READ : పరాగ్వే అధ్యక్షుడిని తొలగించి అరెస్ట్ చేశారు
మరోవైపు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ ఆదేశించారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణకు ప్రముఖులు, రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. డీఎంకే మిత్రపక్షమైన కమల్ హాసన్ స్పందిస్తూ ఈ ఘటనను తమిళ భాషకు జరిగిన అవమానంగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేత మాణికం టాగోర్ లైబ్రరీ పుస్తకాల కొనుగోళ్లపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసలు పుస్తకాలు ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎవరి ఆదేశాలతో సరఫరా అయ్యాయి? ఈ వ్యవహారంలో ఎవరికి లబ్ధి చేకూరింది? అనే ప్రశ్నలకు విచారణలో సమాధానం లభించాల్సి ఉంది.
