హైదరాబాద్ లో పాత బట్టల కారణంగా పోగవుతున్న గుట్టల కొద్దీ వ్యర్థాలు అధికారులకు, పారిశుధ్య కార్మికులకు తలనొప్పిగా మారింది. దీంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగా 2026 నవంబర్ 7న వస్త్ర సేతు కార్యక్రమం ప్రారంభించారు.
వస్త్ర వ్యర్థాల తగ్గింపునకు ఎంఎంసీ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్యర్యంలో వస్త్ర సేతు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పాత దుస్తుల సేకరణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. సేకరించిన దుస్తులను అవసరమైన వారికి అందించేలా చర్యలు తీసుకుంటారు.
పాత దుస్తుల పునర్వినియోగం, అప్‌సైక్లింగ్ ద్వారా కొత్త ఉత్పత్తులను తయారు చేయనున్నారు. వస్త్ర వ్యర్థాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యంతో సర్క్యులర్ ఎకానమీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ చెప్పారు.
ఉపయోగించని దుస్తులు మరొకరికి కొత్త ఆశగా మారుతాయన్న సందేశంతో కార్యక్రమం ప్రారంభించారు. పాత దుస్తులను దానం చేసి పునర్వినియోగానికి సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, గూంజ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
