అయోధ్యలో వైభవంగా పదో దీపోత్సవం.. సరయూ తీరంలో 30 లక్షల దీపాల వెలుగులు!

అయోధ్యలో వైభవంగా పదో దీపోత్సవం.. సరయూ తీరంలో 30 లక్షల దీపాల వెలుగులు!

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం మరోసారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో పదో దీపోత్సవ వేడుకలు శనివారం (నవంబర్ 7, 2026) అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా సరయూ నది తీరం, రామ్ కీ పైడి సహా మొత్తం 56 ఘాట్‌లు 30 లక్షలకు పైగా మట్టి దీపాల వెలుగులతో ప్రకాశించాయి.దీపోత్సవ్2026లో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి ఇచ్చారు.  నదీ తీరమంతా దీపకాంతులతో నిండిపోవడంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్మింది. ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు.

ఈ వేడుకల నిర్వహణలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీకి చెందిన 35 వేల మంది విద్యార్థులు, వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. ఘాట్‌ల వెంట దీపాలను క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో నూనె పోసి, వత్తులు అమర్చడం, ఒకేసారి వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాన రామ మందిర ప్రాంగణాన్ని కూడా లక్షకు పైగా దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రవేశ ద్వారాలు, పరిసర ప్రాంతాలను పూలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. 

2వేల100 డ్రోన్లతో ఆకాశంలో రామాయణం

ఈ ఏడాది దీపోత్సవంలో 2వేల100 స్వదేశీ డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. శనివారం రాత్రి వేళ ఆకాశంలో డ్రోన్లు ప్రత్యేక ఆకృతుల్లో కదులుతూ రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరించాయి. శ్రీరాముడి జీవితం, రావణ సంహారం, రామదర్బార్ వంటి దృశ్యాలను సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతంగా ప్రదర్శించారు. దీనికి తోడు లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్, సంగీత బాణసంచా ప్రదర్శనలు వేడుకలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

శ్రీరాముడికి ప్రతీకాత్మక పట్టాభిషేకం

ఈ వేడుకల్లో భాగంగా శ్రీరాముడికి ప్రతీకాత్మక పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు  ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రధారుల రాకతో రామాయణ కాలం నాటి ఘట్టాలను మరోసారి గుర్తుచేశారు. అనంతరం సరయూ నది తీరంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య మహా హారతి నిర్వహించారు. వేలాది మంది ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించారు. 

12 వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు

దీపోత్సవంలో భాగంగా సుమారు 2వేల500 మంది కళాకారులు 12 వేదికలపై వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళారూపాలతో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, లావోస్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన కళాకారులు రామలీలా ప్రదర్శనలు నిర్వహించారు. రామాయణంలోని ఏడు కాండాలకు సంబంధించిన 22 ప్రత్యేక శకటాలతో ఊరేగింపు నిర్వహించారు. రామరథం, రామదర్బార్, పుష్పక విమానం వంటి నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.