సింగపూర్ లో పెద్ద ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్యామిలీతో పాటు అక్కడే ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత మేనల్లుడి పెళ్లికని ఇండియా వచ్చారు. పండుగపూట కారు పార్కింగ్ విషయంలో మొదలైన వివాదంతో హత్యకు గురయ్యాడు. పెళ్లి చూసుకుని తిరిగి వెళ్దామనుకున్న వ్యక్తి 15 రౌండ్ల కాల్పులకు బలికావడం హర్యానాలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫరీదాబాద్ లో పరంజీత్ ధన్కర్ అనే వ్యక్తి హత్య తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు రోజులు దీపావళి ఉందనగా జరిగిన ఈ ఘటనలో పరంజీత్ చనిపోయాడు. మోహన్ అలియాస్ మోను శర్మ అనే వ్యక్తి అసహనానికి 9 బుల్లెట్ గాయాలతో చనిపోయాడు.
పరంజీత్ భార్య, కొడుకు, కూతురుతో ఫరీదాబాద్ లోని 641 ఇంట్లో ఉంటున్నారు. సింగపూర్ లోని ఓ పెద్ద జాతీయ కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఉండిపోయారు. 2026 నవంబర్ 24న మేనల్లుడి పెళ్లి కోసం వచ్చాడు.
సాయంత్రం 8 గంటలకు జిమ్ నుంచి ఇంటికి వచ్చిన పరంజీత్ కు, మోను శర్మతో పార్కింగ్ వివాదం ఏర్పడింది. అదే అపార్ట్మెంటులో 3 ఫ్లోర్ లో ఉండే మోను శర్మ.. అసహనంతో తన లైసెన్స్డ్ గన్ తో 15 రౌండ్ల కాల్పులు జరిపాడు. పరంజీత్ ను కాల్చేసి వెంటనే కుటుంబంతో సహా పారిపోయాడు.
అంతకు ముందే గొడవ
అయితే రెండు ఫ్యామిలీస్ మధ్య అంతకు ముందే గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు ఐదు రోజుల ముందు పరంజీత్ కొడుకును మోను శర్మ తిట్టినట్లు చెప్పారు. పారిపోయిన శర్మ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. పరంజీత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి తరలించారు.
